సుమారు రూ 65 వేల కోట్ల మొత్తాన్ని ఎరువుల సబ్సిడీకి వినియోగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎరువుల సబ్సిడీ వల్ల సుమారు 14 కోట్ల మంది రైతులు లాభపడనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 17.8 శాతం మేర ఎరువుల వినియోగం పెరిగిందని చెప్పారు.
అనుకూలమైన రుతుపవనాల వల్ల దేశ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు. 2016-17లో 488 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను వాడారని, 2020-21 కాలపరిమితికి ఆ వినియోగం 673 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనున్నట్లు మంత్రి చెప్పారు. రాబోయే సీజన్‌లో రైతులందరికీ సరైన సమయంలో సబ్సిడీ అందించేందుకు 65 వేల కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు.
ఈ వార్షిక సంవత్సరానికి పీఎం గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజన స్కీమ్‌కు అదనంగా రూ 10 వేల కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు. ఐడియాస్ స్కీమ్ కోసం రూ 3000 కోట్లు రిలీజ్ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి కోసం బయోటెక్నాలజీ శాఖకు సుమారు రూ 900 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి సీతారామన్ వెల్లడించారు.
క్యాపిటల్, ఇండస్ట్రియల్ ఎక్స్‌పెండిచర్ కోసం అదనంగా రూ 10,200 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తులు, గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమ ప్రోత్సాహకాల కింద ఆ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. ఆత్మనిర్బర్ భారత్-3 కింద ఇవాళ 12 ప్రకటనలు చేశామని, వాటి మొత్తం సుమారు 2.65 లక్షల కోట్లు ఉంటుందని మంత్రి సీతారామన్ తెలిపారు.
కాగా, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, బలంగా కోలుకుంటోందని ఆర్ధిక మంత్రి తెలిపారు. మూడవ త్రైమాసికంలో వృద్ధి బలంగా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో పీఎంఐ 58.9గా ఉందని చెబుతూ దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షల నుంచి 4.9 లక్షలకు చేరుకున్నదని పేర్కొన్నారు. కరోనా మరణాల రేటు 1.47 శాతానికి పడిపోయిందని చెప్పారు.
క్రమంగా జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయని చెబుతూ అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటినట్లు చెప్పారు. సెప్టెంబర్ ఒకటి నుంచి రేషన్ కార్డులకు పోర్టబులిటీ కల్పిస్తున్నట్లు మంత్రి సీతారామన్ చెప్పారు. ఇంటర్ స్టేట్ పోర్టబులిటీ వల్ల సుమారు 68.6 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరనున్నది.
28 రాష్ట్రాల్లో ఎఫ్‌పీఎస్ సౌలభ్యం అమలులో ఉన్నట్లు ఆమె చెప్పారు. రేషన్ కార్డు పోర్టబులిటీ ద్వారా 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. 28 రాష్ట్రాల్లో వన్ నేషన్, వన్ రేషన్ కార్డు విధానం అమలులో ఉందని వివరించారు.
వలస కూలీల డేటా కోసం కేంద్ర కార్మిక శాఖ, ఆర్థిక శాఖతో కలిసి పనిచేస్తున్నదని, ఈ అంశంపై ఇతర మంత్రిత్వశాఖలు కూడా అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. వలస కూలీల కోసం ప్రత్యేక పోర్టల్‌ను తయారు చేయనున్నట్లు మంత్రి సీతారామన్ వెల్లడించారు.
నాబార్డ్ ద్వారా రైతులకు రూ 25వేల కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. 2.5 కోట్ల రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా క్రెడిట్ బూస్ట్ కల్పించామని, రైతులకు సుమారు రూ 1.4 లక్ష కోట్లు పంపిణీ చేశామని చెబుతూ ఎన్‌బీఎఫ్‌సీ-హెచ్ఎఫ్‌సీలకు స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ కింద 7227 కోట్లు మంజూరీ చేశామని తెలిపారు.
ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద ఎస్‌బీఐ ఉత్సవ్ కార్డులను పంపిణీ చేసినట్లు మంత్రి సీతారామన్ చెప్పారు. అక్టోబర్ 12న ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద 11 రాష్ట్రాలకు 3621 కోట్లు విడుదల చేశారు. ఇన్‌కంట్యాక్స్ రిఫండ్ స్కీమ్ కింద సుమారు 39.7 లక్షల మంది పన్నుదారులకు దాదాపు 1,32,800 కోట్లు వెనక్కి వెళ్లినట్లు మంత్రి తెలిపారు.
More Stories
త్వరలో జనగణన… ఆ తర్వాతే కులగణనపై నిర్ణయం!
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర