ఆర్థిక మాంద్యం దిశ‌గా భార‌త్

దేశ చ‌రిత్ర‌లో తొలిసారి  భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ మాంద్యంలోకి ప్ర‌వేశించిన‌ట్లు ఆర్బీఐ అంచ‌నా వేసింది. భార‌త జీడీపీ వ‌రుస‌గా రెండ‌వ క్వార్ట‌ర్‌లోనూ పేల‌వ ప్ర‌ద‌ర్శన చూపిన‌ట్లు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది. 

జీడీపీ 8.6 (మైన‌స్‌) శాతానికి ప‌డిపోవ‌డం వ‌ల్ల దేశం అసాధార‌ణ రీతిలో ఆర్థిక మాంద్యం దిశ‌గా వెళ్తోంద‌ని ఆర్బీఐ అభిప్రాయ‌ప‌డింది.  ఆర్బీఐ ద్ర‌వ్య విధాన ప‌ర‌ప‌తికి చెందిన డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ మైఖేల్ పాత్ర త‌న నివేదిక‌లో వెల్ల‌డించారు. 

సెప్టెంబ‌ర్‌లో ముగిసిన త్రైమాసికానికి జీడీపీ 8.6 శాతానికి త‌గ్గిన‌ట్లు నౌక్యాస్ట్ రిపోర్ట్‌లో ఆర్బీఐ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మ‌ధ్య కాలంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ 24 శాతం ప‌డిపోయిన‌ట్లు ఆ నివేదిక‌లో వెల్ల‌డించారు. 

2020-21వ వార్ష‌క సంవ‌త్స‌రంలో.. తొలి అర్థ‌భాగంలో దేశం సాంకేతికంగా మాంద్యంలో ప్ర‌వేశించిన‌ట్లు ఆర్బీఐ పేర్కొన్న‌ది. అయితే మాంద్యానికి సంబంధించిన అధికారిక లెక్క‌ల‌ను న‌వంబ‌ర్ 27వ తేదీన ప్ర‌భుత్వం వెల్ల‌డించ‌నున్న‌ది.  

 కోవిడ్19 మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక కార్య‌క‌లాపాలు కుంటుప‌డ్డాయ‌ని, కానీ అక్టోబ‌ర్‌లో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ కొంత ఆశాజ‌న‌క ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింద‌ని, వ్యాపార‌వేత్త‌ల్లో న‌మ్మ‌కాన్ని నిలిపిన‌ట్లు ఆర్బీఐ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఈ విప‌త్తు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఆర్బీఐ తెలిపింది.