కరోనాను అంతమొందించే రష్యా అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ కోవిడ్ స్పుత్నిక్ వి భారత్‌కు చేరుకుంది. భారత్‌లో 2-3 దశల క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్‌కు అనుమతులు దక్కిన సంగతి తెలిసిందే.
త్వరలోనే పరీక్షలు మొదలుపెట్టనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ అధికారి ఒకరు తెలిపారు. డాక్టర్ రెడ్డీస్, స్పుత్నిక్ వి అన్న లోగోలున్న వాహనం నుండి చిన్న పాటి కంటైనర్లను కిందకు దించుతున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
రష్యాకు చెందిన గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ కోవిడ్ నిరోధానికి 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని చెబుతున్నారు. ఈ విషయాన్ని గమలేయా, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) ఒక ప్రకటనలో తెలిపాయి.
దాదాపు 40 వేల మంది వాలంటీర్లపై రష్యాలో నిర్వహించిన అతిపెద్ద మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన తొలి మధ్యంతర డేటా ఆధారంగా ఈవిషయాన్ని ధ్రువీకరించినట్లు ఆ సంస్థలు వివరించాయి.
డాక్టర్ రెడ్డీస్, ఆర్‌డిఐఎఫ్, రష్యా సావరిన్ వెల్త్ ఫండ్‌లు భారత్‌లో ఈ వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి సెప్టెంబర్ 2020న ఒప్పందం కుదుర్చుకున్నాయి.
భారత నియంత్రణ సంస్థల అనుమతుల అనంతరం 10 కోట్ల డోసులను డాక్టర్ రెడ్డీస్‌కు ఆర్‌డిఐఎఫ్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 11,2020న రష్యాలో స్పుత్నిక్ విని రిజిస్టర్ చేశారు.
More Stories
నిషేధానికి ముందే అమెరికాలో టిక్ టాక్ నిలిపివేత
కరోనా తర్వాత కంగనాకు అతిపెద్ద ఓపెనింగ్ ‘ఎమర్జెన్సీ’
బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయం పన్ను బిల్లు