పన్ను ‘ఉగ్రవాదం’ నుంచి పన్ను ‘పారదర్శకత’ వైపు  

పన్ను ‘ఉగ్రవాదం’ నుంచి పన్ను ‘పారదర్శకత’ వైపు  
పన్ను ‘ఉగ్రవాదం’ నుంచి పన్ను ‘పారదర్శకత’ వైపు దేశం పయనిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వివాదాల పరిష్కార వ్యవస్థను మెరుగుపర్చడమే ఇందుకు కారణమన్నారు. ఒడిశాలోని కటక్‌లో ఏర్పాటు చేసిన ఆదాయ పన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ కార్యాలయాన్ని ఆయన ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభిస్తూ  గత ఆరేండ్లలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పన్ను సంస్కరణల గురించి ప్రస్తావించారు. 
 
కార్పొరేట్‌ పన్ను రేటును తగ్గించామని, ఆదాయ పన్నుచెల్లింపుల వ్యవస్థను సరళతరం చేయడంతోపాటు ఫేస్‌లెస్‌ అప్పీల్స్‌, క్విక్‌ రిఫండ్‌ లాంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ‘గత ప్రభుత్వాల హయాంలో పన్ను ఉగ్రవాదం పెద్ద సమస్యగా ఉండేది. ఆ సమస్యను వదిలించుకుని దేశం పన్ను పారదర్శకత వైపు అడుగులు వేస్తున్నది’ అని పేర్కొన్నారు. 
 
పన్ను సంస్కరణల ఉద్దేశాన్ని మేము ప్రజలకు విస్తృతంగా వివరించడం వల్లనే ఈ మార్పు సాధ్యమైందని వివరించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత పన్ను చెల్లింపుదారులకు, పన్నులను వసూలు చేసేవారికి మధ్య ఉన్న సంబంధాల్లో పెద్ద మార్పేమీ రాలేదని, కానీ ఇప్పుడు మార్పు వస్తున్నదని చెప్పారు. 
 
పన్ను చెల్లింపుదారుల హక్కులను, బాధ్యతలను గుర్తించే అతికొద్ది దేశాల్లో భారత్‌ ఒకటని పేర్కొన్నారు, పన్ను చెల్లింపుదారులకు, పన్ను వసూలు చేసేవారికి మధ్య విశ్వాసాన్ని, పారదర్శకతను పునరుద్ధరించడంలో ఇది కీలక చర్యని తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు అసౌకర్యం కలగకూడదని స్పష్టం చేశారు. సంపదను సృష్టించేవారిని గౌరవించాలని సూచిస్తూ వారి సమస్యలను పరిష్కరించడం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని మోదీ భరోసా ఇచ్చారు.