భారత్‌కు మరో 20 వేల టన్నుల ఇంధనం

భారత్‌కు మరో 20 వేల టన్నుల ఇంధనం
ఎల్‌పీజీ లోడ్‌ తో కూడిన ట్యాంకర్‌ ‘సైమీ’ సురక్షితంగా గుజరాత్ ‌లోని కండ్లా పోర్టుకు చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక దాదాపు 20 వేల టన్నుల ఇంధనాన్ని తీసుకొచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం మధ్య మే 13వ తేదీన ఈ నౌక హర్మూజ్‌ జలసంధిని దాటింది. నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు భారత్‌కు చేరింది.  నౌకలో మొత్తం 21 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఎనిమిది మంది ఉక్రేనియన్‌లు, 13 మంది ఫిలిప్పీన్స్  పౌరులు.
ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో హర్మూజ్‌ ను విజయవంతంగా దాటిన 11వ ఎల్‌పీజీ ట్యాంకర్‌ గా ‘సైమీ’ని చెప్పవచ్చు.  షిప్పింగ్, విదేశాంగ, రక్షణ, చమురు శాఖల సమన్వయంతో ‘సైమీ’ భారత్‌కు చేరుకుంది.  పశ్చిమాసియా ఉద్రిక్తతలవల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. హర్మూజ్‌ జలసంధిలో 75 రోజులుగా అంతరాయాల కారణంగా భారత్ ముడిచమురు నిల్వలు గణనీయంగా తగ్గాయి. గడిచిన కొన్ని నెలల్లోనే భారతదేశ చమురు నిల్వలు దాదాపు 15 శాతం మేర పడిపోయాయి. 
 
ఫిబ్రవరి చివరలో ఈ సంక్షోభం ప్రారంభమైనప్పుడు చమురు నిల్వలు 107 మిలియన్ బ్యారెల్స్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నిల్వలు 91 మిలియన్ బ్యారెల్స్‌కు పడిపోయాయని ఇంధన విశ్లేషణ సంస్థ కెప్లర్ తెలిపింది. కాగా, దిగుమతులు తగ్గినప్పటికీ భారతీయ రిఫైనరీలు తమ కార్యకలాపాలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి.  ప్రాసెసింగ్ పనుల్లో ఇప్పటివరకు ఎలాంటి కోతలు విధించకుండా స్థిరంగా నడిపిస్తున్నాయి. అయితే సరఫరాలో అంతరాయాలు కొనసాగితే రిఫైనరీల నిర్వహణ భారంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ముడిచమురు ప్రాసెసింగ్ స్థాయులను తగ్గించుకోవడం మినహా వేరే మార్గం ఉండదని విశ్లేషకులు అంటున్నారు.