`అజిత్ దోవల్ రహస్య ఏజెంట్’గా రూ 100 కోట్ల ఆస్తులతో నకిలీ ఐఏఎస్ 

`అజిత్ దోవల్ రహస్య ఏజెంట్’గా రూ 100 కోట్ల ఆస్తులతో నకిలీ ఐఏఎస్ 
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రహస్య ఏజెంట్‌గా చెప్పుకున్న నకిలీ ఐఏఎస్‌ అధికారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘భారత ప్రభుత్వం’ అని రాసి ఉన్న టెస్లా కారుతో సహా విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌లోని ఖగారియా జిల్లా గోగ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్‌పూర్‌లో నివసిస్తున్న మనీష్‌ గుప్తా, ఐఏఎస్‌ అధికారిగా చెలామణి అవుతూ రూ 100 కోట్ల మేరకు ఆస్తులు సమకూర్చుకున్నట్లు గుర్తించారు. 
 
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రహస్య ఏజెంట్‌గా చెప్పుకున్నాడు. ‘భారత ప్రభుత్వం’ అని రాసి ఉన్న, పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ ఉన్న ఖరీదైన టెస్లా కారులో బీహార్‌ అంతటా అతడు తిరుగుతున్నాడు.  మనీష్‌ గుప్తాపై అనుమానించిన పోలీసులు విలాసవంతమైన అతడి ఇంట్లో సోదాలు చేశారు. అతడు చూపించిన ఐఏఎస్ అధికారి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కార్డులు నకిలీ అని గుర్తించారు. 
 
సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ ఉన్న టెస్లా కారు, టాటా సఫారీ వాహనం, విదేశీ మద్యం బాటిల్స్‌, ఐదు ఆపిల్‌ ఐఫోన్లు, బ్యాంక్ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, చెక్‌ బుక్‌లు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బారాసింఘా లేదా చిత్తడి జింకకు చెందినవిగా భావిస్తున్న రెండు కొమ్ములు కూడా ఆ ఇంట్లో లభించాయి. మరోవైపు బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో మోసాలు, అక్రమాలకు పాల్పడేందుకు ఐఏఎస్ అధికారిగా నకిలీ గుర్తింపు కార్డును మనీష్‌ గుప్తా వినియోగించినట్లు ఖగారియా ఎస్పీ భాను ప్రతాప్ సింగ్ తెలిపారు.   నిందితుడి వద్ద 31 లీటర్ల ఖరీదైన విదేశీ మద్యం, ఐదు ఐఫోన్‌లు కూడా లభించాయని చెప్పారు.

“మనీష్ గుప్తా ఐఏఎస్ అధికారిగా నటిస్తూ ప్రజలను మోసం చేసేవాడు. అతని వద్ద ఒక ఐఏఎస్ గుర్తింపు కార్డు కూడా దొరికింది. విచారణ సమయంలో, తాను అజిత్ దోవల్ వద్ద అండర్ కవర్ ఏజెంట్‌గా పనిచేస్తున్నానని అతను చెప్పుకున్నాడు. పోలీసులు టెస్లా కార్‌తో సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు,” అని ఆయన పేర్కొన్నారు.

ప్రజలను బెదిరించి, మోసం చేయడం ద్వారా నిందితుడు సుమారు రూ. 100 కోట్ల భారీ సంపదను కూడబెట్టాడని సింగ్ చెప్పారు. ఈ వ్యవహారం మొత్తాన్ని దర్యాప్తు చేయడానికి పాట్నాలోని ‘ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్’ (ఆర్థిక నేరాల విభాగం) బృందాన్ని పిలిపించనున్నట్లు ఆయన తెలిపారు.