పేపర్ లీక్ లపై దేశవ్యాప్తంగా ఈడీ చర్యలు 

పేపర్ లీక్ లపై దేశవ్యాప్తంగా ఈడీ చర్యలు 

ప్రశ్నపత్రం లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఆవలంభిస్తున్న కఠిన వైఖరిలో  భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టింది. ఉన్నత స్థాయి ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, రాజస్థాన్, హర్యానా, అస్సాం (గువహతి), బీహార్ (పాట్నా), కర్ణాటక (బెంగళూరు), మహారాష్ట్ర , జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నపత్రం లీక్ కేసులకు సంబంధించి ఈడీ ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్’ (ఈసీఐఆర్) నమోదు చేసింది. 

ఈ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లను ఈడీ తన పరిధిలోకి తీసుకుంది. ప్రశ్నపత్రం లీక్ కేసులకు సంబంధించిన నేరపూరిత ఆదాయం, డబ్బు ప్రవాహం, ఆర్థిక లావాదేవీలపై ఆ సంస్థ దర్యాప్తు చేయనుంది. త్వరలోనే నీట్-యుజి ప్రశ్నపత్రం లీక్ కేసులో కూడా ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో నేరపూరిత ఆదాయం, డబ్బు ప్రవాహం, ఆర్థిక లావాదేవీలను దర్యాప్తు చేస్తుంది. 

నీట్ యుజి ప్రశ్నాపత్రం లీక్ విషయమై విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉన్నత విద్యా శాఖ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా సిబిఐ కేసు నమోదు చేసింది. ఏ రాష్ట్రంలో లీక్ జరిగినప్పటికీ, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈడీ దర్యాప్తు చేస్తుందని స్పష్టం చేసింది. “నా రాష్ట్రం, నీ రాష్ట్రం” అనే ధోరణిని అనుమతించబోమని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. దీనివల్ల, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ప్రశ్నపత్రం లీక్ కేసులపై ఈడీ ఈసీఐఆర్ లను నమోదు చేసింది. 

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ) నిర్వహించిన పరీక్షలలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలకు సంబంధించి, ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’ (పీఎంఎల్ఏ) కింద ఈడీ ఒక ఈసీఐఆర్ ను నమోదు చేసింది. రాంచీలో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా వారం రోజుల క్రితం ఈ ఈసీఐఆర్ దాఖలు చేసింది. అధికారుల సమాచారం ప్రకారం, పరీక్షల అక్రమాలకు సంబంధించిన డబ్బు ప్రవాహంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

ఈ అక్రమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీల ద్వారా నేరపూరిత ఆదాయం సమకూరిందా? లేదా ఆ ఆదాయం మళ్లించారా? అనే అంశాలను దర్యాప్తులో పరిశీలిస్తారు. పరీక్షలకు సంబంధించిన కార్యకలాపాలతో ముడిపడి ఉన్నట్లు ఆరోపించబడుతున్న నిధుల మూలాలు, వాటి కదలికలను ఈడీ గుర్తించే అవకాశం ఉంది. ఆరోపించబడిన అక్రమాల వల్ల లబ్ధి పొంది ఉండవచ్చని భావిస్తున్న వ్యక్తులు లేదా సంస్థలను గుర్తించడానికి ఆర్థిక రికార్డులు, బ్యాంక్ లావాదేవీలు, ఇతర పత్రాలను కూడా పరిశీలించవచ్చు.