ఇరాన్ యుద్ధంతో  అదుపు తప్పుతున్న ఆహార ధరల ద్రవ్యోల్బణం 

ఇరాన్ యుద్ధంతో  అదుపు తప్పుతున్న ఆహార ధరల ద్రవ్యోల్బణం 
ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో కల్లోలం ప్రభావంతో రవాణా నుంచి ఆహార ధరల వరకు పాకింది. బియ్యం నుంచి నూనె వరకు, చక్కెర నుంచి చికెన్‌ వరకు ధరల ఒత్తిడి కనిపిస్తోంది. ఇంధన ధరలు మరింత పెరిగితే ఈ భారం మరింత విస్తరించే అవకాశం ఉంది.  ఆగస్టులో దేశ రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది. ఆహార ద్రవ్యోల్బణం మాత్రం 5.95 శాతంగా నమోదైంది. జూలైలో ఇది 5.52 శాతం.  అంటే ఆహార ధరల ఒత్తిడి మరింత పెరిగింది. 
 
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ధరల పర్యవేక్షణ ప్రకారం మార్చి 17న దేశవ్యాప్తంగా కిలో బియ్యం సగటు ధర రూ.42.99గా ఉంది. సెప్టెంబర్ 17న అది రూ.46.50కు చేరింది. ఆరు నెలల్లో సుమారు 8.2 శాతం పెరిగింది. పప్పుల్లోనూ పెరుగుదల ఉంది. కందిపప్పు కిలో రూ.122.27 నుంచి రూ.124.24కు చేరింది. అంటే ఆరు నెలల్లో 1.6 శాతం పెరుగుదల. మినపప్పు రూ.117.28 నుంచి రూ.122.64కు చేరి 4.6 శాతం పెరిగింది. 
 
పప్పుల ధరల పెరుగుదల బియ్యం కంటే తక్కువగా కనిపించినా, ప్రతి నెలా కొనాల్సిన వస్తువులు కావడంతో కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం ఉంటుంది.  వంటనూనెల విషయంలో భారం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కిలో ధర మార్చిలో రూ.180.24 నుంచి సెప్టెంబర్‌లో రూ.193.18కి చేరింది. అంటే సుమారు 7 శాతం పెరుగుదల.  పామాయిల్‌ రూ.139.89 నుంచి రూ.152.52కు చేరింది. దాదాపు 9 శాతం పెరిగింది. ఆవ నూనె కూడా ఆరు నెలల్లో సుమారు 8 శాతం పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు, దిగుమతుల వ్యయం పెరగడం వంటి అంశాలు వంటనూనెలపై ఒత్తిడిని పెంచుతున్నాయి.  చక్కెర ధర మాత్రం మరింత వేగంగా పెరిగింది. మార్చిలో కిలోకు సగటున రూ.46.33గా ఉన్న ధర సెప్టెంబర్‌లో రూ.58.66కు చేరింది.  అంటే ఆరు నెలల్లో ఏకంగా 26.6 శాతం పెరిగింది. ఆగస్టు సిపిఐలో కూడా చక్కెర ధర ఏడాది ప్రాతిపదికన 24.2 శాతం పెరిగినట్లు నమోదైంది. చెరకు దిగుబడి అంచనాలు తగ్గడం, ఇథనాల్‌ తయారీకి చెరకు మళ్లడం వంటి కారణాలు దేశీయ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి.  కూరగాయల్లో ఉల్లిపాయ ధర మరింత ఆందోళన కలిగిస్తోంది. 
 
సెప్టెంబర్ 18న దేశవ్యాప్తంగా కిలో ఉల్లి సగటు ధర రూ.53.86గా ఉంది. ఆగస్టు సిపిఐలో ఉల్లి ధర ఏడాది కంటే ఏకంగా 48.27 శాతం పెరిగింది. కొత్త పంట మార్కెట్‌కు రావడంలో ఆలస్యం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. అల్లం ధరలో పెరుగుదల ఇంకా ఎక్కువ.  ఆగస్టులో ఏడాది ప్రాతిపదికన అల్లం ధర 73.82 శాతం పెరిగింది. వెల్లుల్లి ధర 43.60 శాతం పెరిగింది. 
 
సెప్టెంబర్ 18న దేశవ్యాప్తంగా అల్లం సగటు రిటైల్‌ ధర కిలోకు రూ.35.86, వెల్లుల్లి రూ.45.05గా నమోదైంది. అయితే ప్రతి ఆహార వస్తువు ధర పెరగడం లేదు. టమాటా ధర ఆగస్టులో ఏడాది కంటే 31.09 శాతం తగ్గింది. బంగాళాదుంప ధర 13.14 శాతం తగ్గింది. అంటే ఆహార ద్రవ్యోల్బణం అన్నది అన్ని వస్తువుల ధరలు ఒకే దిశలో పెరగడం కాదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
 
మాంసాహారం విషయానికి వస్తే ఆగస్టు సిపిఐ గణాంకాల ఆధారంగా చికెన్‌ ధర ఏడాది ప్రాతిపదికన 14.12 శాతం పెరిగింది. మటన్‌, చేపల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇంటి వంట గ్యాస్‌ ధర పదిశాతం పెరిగింది. వంటింటి ఖర్చు మాత్రమే కాదు. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, రెస్టారెంట్లలోనూ ధరలు పెరిగిపోయాయి. ఆగస్టులో రెస్టారెంట్లు, వసతి సేవల ద్రవ్యోల్బణం 8 శాతానికి పైగా నమోదైంది. ఆహారం, పానీయాల సేవల ఖర్చులు కూడా పెరిగాయి. 
 
అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ప్రతి ధర పెరుగుదలకూ ఇరాన్‌ సంక్షోభమే కారణమని చెప్పడం సరికాదు. బియ్యం, చక్కెర, ఉల్లి, అల్లం, వెల్లుల్లి వంటి వాటి ధరలపై దేశీయ పంటలు, వర్షపాతం, సరఫరా పరిస్థితులు కూడా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ ఇంధన షాక్‌ ఇప్పటికే ఉన్న ఈ ఒత్తిడికి అదనపు భారంగా మారే అవకాశం ఉంది.