ఎన్నికల ముందు బిజెపిలోకి మమతా మంత్రి!

పశ్చిమ బెంగాల్ శాసనసభకు వచ్చే ఏడాది మొదటిలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ ఎదురు దెబ్బ తగలనుంది. ఆమె కేబినెట్ మంత్రి శువేంద్ర  అధికారి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు చెబుతున్నారు.  ఇప్పటికే ఆయన బీజేపీ అధిష్ఠానంతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

గురువారం సీఎం మమతా అధ్యక్షతన మంత్రివర్గ సమావేశానికి ఈ మంత్రి శుభేంద్ర డుమ్మా కొట్టారు. అంతేకాకుండా టీఎంసీకి వ్యతిరేకంగా ఓ ర్యాలీని కూడా నిర్వహించారు.  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండ్రోజుల బెంగాల్ పర్యటన ముగిసిన తర్వాత ఈ పరిణామం సంభవించడం  గమనార్హం.

పైగా, ఇప్పటి వరకు శుభేంద్ర సీఎం మమత బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడు. మంత్రివర్గంలోని సభ్యుల్లో శుభేంద్రపైనే సీఎం మమత చాలా నమ్మకంతో ఉంటారని టీఎంసీ వర్గాలు బాహాటంగానే పేర్కొంటాయి. అంతటి నమ్మకస్తుడు, పైగా కేబినెట్ మంత్రే ఏకంగా బీజేపీలో చేరనున్నారంటే అధికార పక్షానికి పెద్ద షాకే అని అభిప్రాయపడుతున్నారు.

అయితే విచిత్ర పరిణామం ఏమంటే  మరో ఇద్దరు కేబినెట్ మంత్రులు కూడా ఈ కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టారు. రాజీవ్ బెనర్జీ, గౌతమ్ దేవ్ ఇద్దరు కేబినెట్ మంత్రులు. వీరు కూడా కొన్ని రోజులుగా సీఎం మమతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే వీరు బీజేపీలో చేరతారా? లేదా? అన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పలు సందర్భాలలో శువేంద్ర అధికారి నిత్యం ప్రజలతో సంబంధాలున్న, కష్టపడి పనిచేసే మంత్రి అంటూ పొగడటం గమనార్హం. ఈ నెల మొదట్లో ఆయనను బీజేపీలో చేరమని బిజెపి ఎంపీ, యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు సౌమిత్రా ఖాన్ బహిరంగంగా ఆహ్వానించి సంచలనం రేపారు.

మమతా బెనర్జీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన నందిగ్రామ్ లోని రైతుల ఉద్యమంలో అధికారి కీలకపాత్ర వహించారు. 2017లో మమతా సన్నిహితుడు, టిఎంసిలో కీలక నేత ముకుల్ రాయ్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత అంతే ప్రాముఖ్యత గల నేత సహితం బిజెపి వైపు చూడడం రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపుతున్నది.