సరిహద్దు ప్రాంత అభివృద్ధి కోసం రూ. 11,800 కోట్లు  

గ‌త 50 ఏళ్ల‌లో ఏన్న‌డూ లేనంత‌గా దేశ స‌రిహ‌ద్దు గ్రామాల అభివృద్ధి జ‌రిగింద‌ని చెబుతూ సరిహద్దు ప్రాంత అభివృద్ధి కోసం 2020-21 సంవత్సరానికి రూ. 11,800 కోట్ల  బడ్జెట్ నిధులు కేటాయించినట్లు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలిపారు. ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ఆరేళ్లలో దేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను గ‌ణ‌నీయంగా అభివృద్ధి ప‌రిచిన‌ట్లు చెప్పారు.  
 
స‌రిహ‌ద్దు గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం సిమంత్ క్షేత్ర వికాసోత్సవ్ -2020 కార్య‌క్రమాన్ని చేప‌ట్టింది. ఇందులో భాగంగా గుజ‌రాత్‌లోని కుచ్ జిల్లాలో గ‌ల డోర్డో గ్రామంలో గురువారం చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో హోంమంత్రి పాల్గొన్నారు. పాకిస్తాన్‌తో భూ సరిహద్దును పంచుకునే కచ్, బనస్కాంత, పటాన్ జిల్లాల నుంచి ప్రతినిధులు, సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
2008 నుంచి 2014 మధ్య సరిహద్దు ప్రాంతాలలో కేవలం 170 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు జ‌రిగితే మోదీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2020 మధ్య 480 కిలోమీటర్ల రోడ్లు పునర్నిర్మించిన‌ట్లు అమిత్ షా తెలిపారు. అదేవిధంగా 2008 నుంచి 2014 మధ్య సరిహద్దు ప్రాంతాల్లో కేవలం ఒక సొరంగాన్ని మాత్ర‌మే నిర్మించారు. అదే 2014 నుంచి 2020 మధ్య ఆరు సొరంగాలు ఇప్పటికే నిర్మించబడ్డాయని పేర్కొన్నారు. మరో 19 సొరంగాల పనులు ప్రారంభమైన‌ట్లు తెలిపారు. 
 
దేశం తన అంతర్గత భద్రతను బలోపేతం చేయకుండా అభివృద్ధి మార్గంలో ముందుకు సాగదని అమిత్ షా స్పష్టం చేశారు. సరిహద్దు నుండి ప్రజల వలసలను ఆపడం అవసరమని చెప్పారు. సరిహద్దు ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ, విద్య, నగరాలతో సమానంగా మంచి కనెక్టివిటీ సౌకర్యాలు లభించేలా చూడట‌మే ఇటువంటి కార్యక్రమాలను నిర్వ‌హ‌ణ వెనుక ముఖ్య ఉద్దేశం అని అమిత్ షా పేర్కొన్నారు.  
 
రక్షణ దళాల వైమానిక దాడులు, ఎయిర్ స్ర్టైక్స్ గురించి ప్ర‌స్తావిస్తూ గ‌తంలోలాగా దౌత్య ప‌ర‌మైన ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసి ఊరుకోవ‌డం లేద‌ని చెప్పారు. శత్రువులకు తగిన సమాధానం ఇస్తున్నామని హెచ్చరించారు.  దివంగ‌త సర్దార్ వల్లభాయ్ పటేల్ వలసలను ఆపేందుకు సరిహద్దు గ్రామాలకు నీరు, విద్యుత్ అందించారేవారని పేర్కొంటూ ఆయన మరణం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని విస్మ‌రించిందనిధ్వజమెత్తారు .