భగవద్గీత అంతటి ప్రాశస్త్యం గల దీపావళి 

APP37-11 HYDERABAD: November 11 – Hindu girls busy in their religious rituals during Diwali Festival in Shiva Mandir at Thandi Sarak. APP photo by Akram Ali

రాంపల్లి మల్లిఖార్జునరావు 
 
మనదేశంలో జరుపుకునే పండుగలలో కొన్ని ఉత్తర భారతంలో ప్రసిద్ధి, కొన్ని దక్షిణ భారతంలో ప్రసిద్ధి, కానీ దీపావళి పండుగ ఈ దేశమంతా  ప్రసిద్ధి.దీపావళికి పౌరాణికంగా కూడా ఎంతో వైశిష్ట్యం ఉంది. దీపావళి కి సంబంధించి అనేక పురాణ గాధలు  ఉన్నాయి.  ఆ గాధలలో  పాలసముద్రం నుండిలక్ష్మీదేవి ఆవిర్భవించిన శుభ దినం అని కొందరి అభిప్రాయం. 
 
శ్రీరాముడు రావణాది రాక్షసులను అంతమొందించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన రోజు అని కూడా అంటారు. అందుకే అయోధ్యలో దీపోత్సవకార్యక్రమము పెద్దఎత్తున జరుగుతుంది.   మనం జాగ్రత్తగా ఆలోచిస్తే త్రేతాయుగంలో భగవాన్ శ్రీ రామ చంద్రుడు రావణాసురుని విజయదశమి పండుగ రోజున సంహరించాడు,  అందుకే ఆరోజు రామ్ లీలా కార్యక్రమం పెద్దఎత్తున చేసుకొంటాము. 
 
అదే మాసంలో ద్వాపరయుగంలో భగవాన్ శ్రీ కృష్ణుడు నరకాసురుని సంహరించిన రోజు   దీపావళి పండుగ జరుపుకుంటాము,  మొత్తంమీద అసుర సంహారం, అసుర ప్రవృత్తి సంహారము ఎప్పుడైనా లోక కల్యాణానికి దారితీస్తుంది అందుకే ఆ రోజుల్ని పండుగ గా  జరుపుకుంటాం.
 
శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన శుభ ఘడియలలో  జరుపుకొనేది  దీపావళి పండుగ.  అట్లాగే  కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినరోజు గీతాజయంతి జరుపుకొంటాం.  ఈ రెండింటికి కృష్ణుడుతోనే సంభంధం ఉన్నది.  అందుకే దీపావళి  భగవత్గీతకు అన్నగారిని  చెప్పవచ్చు. 
 
 ఉపదేశ  గ్రంథాలలో  భగవద్గీత కు ఎంతటి ప్రాధాన్యత ఉందో  పండుగలలో  దీపావళికి  అంతటి ప్రాధాన్యత ఉంది.   దీపావళి  పండుగ ఈ దేశంలోని  బౌద్ధులు, జైనులులతో సహా  అన్ని మతాలు, సంప్రదాయాల వారు  కూడా జరుపుకుంటారు. 
 
ఈ పండుగకు ఇంకొక విశేషం కూడా ఉంది. ఈ పండుగను  దేశమంతా ఒకే రోజున జరుపుకుంటారు, ఎందుకు ఈ పండుగ కి ఇంతటి  ప్రాధాన్యత ఉందో  తెలుసుకోవాలి.  ఆ   వివరాలు కంచి పరమాచార్య మాటలలో  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం:

” ప్రస్తుతం ఉన్న  అస్సాం  ప్రాంతంలో ప్రాగ్జోతిషపురం అనే నగరం ఉండేది, ఆ నగరాన్నిభౌముడు అనే  రాజు పాలించేవాడు.  అతనికి నరకాసురుడు అనే మరో పేరు ఉండేది. నరకాసురుడు గొప్ప తపస్వి.  దాని  ద్వారా సాధించిన శక్తులను  ప్రజాహితం కోసం కాకుండా  లోకాలను హింసిం చేందుకు ఉపయోగించాడు. 
 
ఆధర్మ మార్గంలో లోకాలను హింసిస్తూ  లోకకంటకుడైనాడు.  అభేద్యమైన దుర్గాలలో అజేయుడుగా ఉండేవాడు.    అతడు కొన్ని వేల మంది కన్యలను చెరపట్టాడు, అట్లాగే సాధు సంతుల ను హింసించేవాడు. ఇటువంటి లోక కంటకులను  సంహరించేందుకు ద్వాపర యుగ అంతంలో భగవంతుడు కృష్ణావతారం  ఎత్తవలసి వచ్చింది.
భగవంతుడు కూడా నరకాసురుని యుక్తితోనే   సంహరించవలసి వచ్చింది.  స్త్రీలకు పుత్ర శోకం కంటే గొప్ప శోకం వేరే లేదు.  భర్త చనిపోతే తనకున్న రక్షణ పోయిందే  తన సౌకర్యాలను చూసేది ఎవరు, ముత్తయిదువుల మైన తమకు హేయమైన వైధవ్యం ప్రాప్తించిందే  అని స్త్రీలు దుఃఖ పడవచ్చు
ఈ దుఃఖం లో కొంత స్వార్థం ఉంది, కానీ కొడుకు విషయం వేరు  కొడుకు వయసులో ఉండి  చనిపోయినప్పుడు  ఆ తల్లి దుఃఖం మాటలలో చెప్పలేము. నరకాసురుని సంహారము జరిగిన  సమయంలో నరకాసురుని  తల్లి లోకానికి విరుద్ధంగా పుత్రశోకం పొందకుండా భగవంతుని చేతిలో చనిపోయిన తన కుమారుని మరణానికి సంతోషించింది.
 
ఎంత అదృష్టం ఉంటే ఎంత తపస్సు చేస్తే తన కొడుక్కి అటువంటి భాగ్యం లభించింది. `నా పుత్రుడు చని పోతే పోనీ నాకు పుత్రశోకం కలిగినా పరవాలేదు లోకాలకు ఏ విధమైన  కష్టం ఉండరాదు’ అని ఆ తల్లికోరుకొంది. నరకాసురుడు లోకాలన్నిటిని ఏకచ్ఛత్రంగా  పరిపాలించిన సార్వభౌముడు అటువంటి పుత్రుడు  చనిపోయిన రోజు లోకాలకు  పండుగ కావాలి అని ఆ తల్లి భగవం తుణ్ణి , ప్రార్థించింది.
అట్లాగే  యుద్ధరంగంలో  భగవాన్ ని చేత పడిపయినప్పుడు    నరకాసురునికి  భగవద్దర్శనం కలిగింది. జ్ఞానోదయం కలిగిన నరకాసురుడు కూడా భగవంతుని ప్రార్థిస్తూ తన స్మృతి చిహ్నంగా మానవజాతి అంతా కూడా పండుగ చేసుకో వాలి అని భగవంతుని ప్రారంభించినట్లు ప్రతీతి.
అట్లాగే ఆరోజు ఎవరెవరు అభ్యంగన స్థానం చేస్తారో  వారికి గంగాస్నాన ఫలం మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని కూడా నరకాసురుడు భగవంతుని ప్రార్థించాడట.  ఈ పండుగ వెనుక పుత్రశోకం కలిగినా  లోక క్షేమం కాంక్షించే ఒక తల్లి ప్రార్ధన ఉన్నది. ఇంతకంటే చిత్తశుద్ధిని వేరే ఎక్కడ చూడగలం?
మనం అయితే ఈ విధంగా ప్రార్ధించి ఉండేవాళ్లమా? నా కొడుకు పోయిన బాధ నాకు లేదు లోకం క్షేమంగా ఉండాలి అన్న కోరిక లో ఎంతటి మహత్తర త్యాగం ఉంది? అందుకే ఈ పండుగని తరతరాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాం.
మనము కష్టపడుతున్నాం,  సుఖ పడుతున్నాం దానికి ఇతరులు దుఃఖించినా  లోకం కష్టపడిన  నాకేం పర్వాలేదు అనే మనోభావం మనకి ఉండకూడదు.  మనకు బాధ కలిగినా పర్వాలేదు లోకం క్షేమంగా ఉండాలి అన్న నీతిని దీపావళి మనకు బోధిస్తున్నది,  అందుకే మన బాధలను మనం సహించు కుంటూ లోక క్షేమం కాంక్షిస్తూ పాటుపడుతూ ఉండాలి.
అందుకే  ఉపదేశ గ్రంథాలు గీత కు కు ఎంత ప్రాధాన్యత ఉందో పండుగలలో లోక క్షేమము అనే మహత్తర ఆకాంక్ష ఉన్న దీపావళికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది”
 
ఇక్కడే  ఇంకొన్ని విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. నరకాసుర సంహారం తరువాత నరకాసురుని చెరలో ఉన్న కన్యలకు శ్రీకృష్ణుడు  విముక్తి కలిగించాడు, ఈ విషయాన్ని లోకానికంతటికి తెలియ చేసాడు.  ఎందుకంటే ఆ కన్యల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకువెళ్లాలని.
కానీ కొద్దిమంది మాత్రమే తీసుకొనివెళ్ళారు.  దానితో  కృష్ణుడికి  మరోసమస్య వచ్చిపడింది.  వేలమంది ఈ కన్యలను ఎట్లా కాపాడాలి? దానిపరిష్కార మంథనలోనే బృందావనం ఏర్పడింది. వాళ్ళందరూ కృష్ణుని భక్తులైనారు అట్లా అప్పుడు తలెత్తిన సామజిక సమస్య పరిష్కరించబడింది. కృష్ణుడి రక్షణలో వారందరు గౌరవంగ జీవించారు.
స్త్రీలను చెరపట్టే  ప్రవృత్తి ఈ రోజు కూడా మనచుట్టూ కనపడుతున్నది, ఆ టువంటి ప్రవృత్తిని అంతం చేయవలసిన అవసరం ఉంది.  అట్లాగే  మన చుట్టూ అనేక అసురీ శక్తులు విజృంభించి పని చేస్తున్నాయి.  కుల వివక్ష, స్వార్థ చింతన లక్ష్యంగా పనిచేసే శక్తులు మన చుట్టూ ఉన్నాయి.
బాధ్యత లేని పౌరుల  దురభిమానాలు, విలువలు లేని విశృంఖలత వాతావరణము. కాలుష్యం మొదలైన వికృతులు మన  జీవన విధానంగా మారి  మన సంస్కృతి సంప్రదాయాలపై ఉదాసీనభావం కలిగిస్తున్నాయి.
అటువంటి ఉదాసీన దృష్టి కలిగిన యువతీ యువకుల విచ్చలవిడితనం, దేశ సరిహద్దుల్లో పొంచి ఉన్న శత్రు వ్యూహాలు ఇట్లాంటి అనేక అసురీ ప్రవృత్తులు మనచుట్టూ ఉన్నాయి. అసురీ భావాలతోకలిగే దుఃఖం కంటే నరకం ఇంకేముంటుంది?
ఇటువంటి  నరకాన్ని పొగొట్టి జ్ఞానానంద కాంతులను వెదజల్లడ టమే దీపావళి ఆంతర్యం.  ఈ శార్వరి {దీని మరోపేరే రాత్రి} ఆ నరకాలు అన్నిటినీ నిర్మూలించి ఆనంద దీప కాంతులను ప్రసరింప చేయవలసిందిగా మనము  ‘’దీపలక్ష్మీ నమోస్తుతే ‘’అని   దీపలక్ష్మిని ప్రార్థిద్దాం. స్వదేశీ ఉత్పత్తులతో నే దీపావళి పండుగ జరుపుకుందాం.