రెండు గంటల పాటు బాణాసంచాకు సుప్రీం అనుమతి 

తెలంగాణ‌లో దీపావ‌ళి వేళ రెండు గంట‌ల పాటు గ్రీన్ క్రాక‌ర్స్ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది. త‌క్కువ స్థాయిలో కాలుష్యం విడుద‌ల చేసే ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన ప‌టాకులు పేల్చేందుకు అత్యున్న‌త న్యాయ‌స్థానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 
రాత్రి 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ప‌టాకులు కాల్చుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది.  జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్‌, సంజీవ్ ఖ‌న్నాల‌తో కూడిన ధ‌ర్మాసనం ఈ తీర్పును వెలువ‌రించింది. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రిగిన అత్య‌వ‌స‌ర విచార‌ణ‌లో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది.   
తెలంగాణాలో బాణాసంచా అమ్మకం, వినియోగంపై హైకోర్టు నిషేధం విధించడంతో తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  న‌వంబ‌ర్ 9న జాతీయ గ్రీన్ ట్రిబ్యుల్ విధించిన ఆంక్ష‌లు అమ‌లు అయ్యేలా రాష్ట్ర ప్ర‌భుత్వం చూడాల‌ని కూడా కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.  

హైకోర్టు విధించిన నిషేధంపై స్టే ఇవ్వాలని కోరింది. దీంతో బాణాసంచా వ్యాపారులకు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. బాణసంచా నిషేధంపై హైకోర్టు ఉత్తర్వులను సవరించింది. దీపావళి రోజు మాత్రమే రెండు గంటలపాటు బాణసంచా కాల్చేందుకు అనుమతినిచ్చింది. రెండు గంటలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలని ఎన్జీటీ సూచించింది.

అంతకు ముందు తెలంగాణలో బాణాసంచా నిషేధించాలంటూ న్యాయవాది ఇంద్రప్రకాశ్ పిల్‌ వేయడంతో షాపులను మూసివేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ బాణాసంచా నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా పేల్చవద్దని హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలంటూ ప్రభుత్వం జీవో-1777 జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వం జీవోపై క్రాకర్స్ షాపు యజమానులు, అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకించారు. టపాసులు బ్యాన్ చేస్తే కోట్లల్లో నష్టపోతామంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.