ఓటుకు నోటు కేసులో 16 నుంచి అభియోగాల నమోదు

ఓటుకు నోటు కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ ఈనెల 16న ప్రారంభించాలని ఎసిబి న్యాయస్థానం నిర్ణయిస్తూ వాయిదా వేసింది. ఈనెల 16న నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ కచ్చితంగా విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. 

మరోవైపు ఎసిబి కోర్టు కొట్టివేసి డిశ్చార్జ్ పిటిషన్లపై ఎంఎల్‌ఎ సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. తమ ప్రమేయం లేకపోయినప్పటికీ.. ఓటుకు నోటు కేసులో ఇరికించారని పిటిషన్లలో పేర్కొన్నారు.హైకోర్టును ఆశ్రయించినందున అభియోగాల నమోదుకు కొంత గడువు ఇవ్వాలని సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా తరఫు న్యాయవాదులు కోరారు.

సండ్ర, ఉదయ్ సింహా అభ్యర్థనపై ఎసిబి అభ్యంతరం వ్యక్తం చేసింది. డిశ్చార్జ్ పిటిషన్లపై ఈనెల రెండో తేదీనే కోర్టు నిర్ణయం వెల్లడించందని, ఈనెల 4న విచారణ సందర్భంగా నిందితులు ఇదే విధంగా కోరగా విచారణ బుధవారానికి వాయిదా వేసినట్లు ఎసిబి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు లేనందున అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.

ఎంపిలు, ఎంఎల్‌ఎలపై కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ఎసిబి తరఫు న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈక్రమంలో ఎసిబి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈనెల 16న అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపింది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ ఆ రోజున కచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.