బీజేపీ నేతల ఫోన్ల ట్యాప్…. కిషన్ రెడ్డి ఆరోపణ 

తెలంగాణ  సర్కారు బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్​ చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్బంగా తమ ఫోన్లను ట్యాప్​ చేసినట్టుగా బీజేపీ నేతల నుంచి తనకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని, ట్యాపింగ్​ నిజమని తేలితే కేంద్ర అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. 
 
కరోనా సమయంలో రాష్ట్ర సర్కారు చేసిందేమిటి, కేంద్రం ఇచ్చిన నిధులెన్ని అన్న దానిపై సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా అని కిషన్​రెడ్డి  సవాల్ చేశారు. కేంద్రం సాయం చేయలేదంటూ టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని హితవు చెప్పారు. 
 
పార్టీ రాష్ట్ర  అధ్యక్షులు ​బండి సంజయ్, సీనియర్​ నేతలు మురళీధర్ రావు, డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి జూమ్​ యాప్​ ద్వారా మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్​ సర్కారు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వరదలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వమే డైరెక్టుగా ఫండ్స్​ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్ల నిధులు కేంద్ర సహకారంతోనే సమకూరాయని స్పష్టం చేశారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని కిషన్ రెడ్డి హితవు చెప్పారు.  కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సరైన సమగ్ర నివేదిక రాష్ట్రం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తాను స్వయంగా రాష్ట్ర అధికారులను అడిగినా అధికారులు స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. 

సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష చేసి పంటనష్టం పై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. గడిచిన ఆరేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రేటర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్ష బాధితులకు రూ.10వేల పంపిణీలో టీఆర్ ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి దయ్యబట్టారు. పేదలకు ముందు డబ్బులు ఇచ్చి వెనుక లాక్కుంటున్నారని ఆరోపించారు. గులాబి కండువాలు వేసుకున్న నేతలు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టి ఆర్ ఎస్ కార్యకర్తలు దోచుకునేందుకేనా 10 వేలు పంచేదని ప్రశ్నించారు. రైతులకు వరదలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ సహాయం అందిస్తుందో చెప్పాలని నిలదీసేరు. కరోనా సమయంలో రాష్ట్రం ఏమి చేసిందో..కేంద్రం ఏమి ఇచ్చిందో చర్చకు సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు.