ఘనంగా జవాన్‌ మహేష్‌ అంత్యక్రియలు

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్‌ జిల్లా జవాన్‌ మహేష్‌ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిశాయి. సొంతూరు కోమనపల్లిలో నిర్వహించిన మహేష్‌ అంత్యక్రియలకు భారీ ఎత్తున ప్రజలు హాజరై కన్నీటి నివాళులర్పించారు. 
 
సైనిక అధికారులు గాలిలో 3 రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. మహేష్‌ పార్థివదేహం పై కుటుంబ సభ్యులు జాతీయ జెండాను కప్పారు. కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాలు, ఆర్మీ అధికారులు అశ్రు నయనాలతో జవాన్‌ కు వీడ్కోలు పలికారు.
 
ఈ నెల 8న జ‌మ్మూక‌శ్మీర్‌ కుప్వారా జిల్లాలోని మాచిన్ సెక్టార్‌లో ముష్కరులను అసమాన సాహసంతో ఎదిరించి, మ‌హేశ్‌ వీరమరణం పొందిన విష‌యం విదిత‌మే.   అమరజవాన్‌ ర్యాడ మహేశ్‌ పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో మంగ‌ళ‌వారం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
అక్కడ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమరవీరుడికి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మహేశ్‌ భౌతికకాయాన్ని ఆయన సొంత ఊరు నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం, కోమన్‌పల్లి గ్రామానికి తరలించారు.
 
ఈ నెల 21 న జవాన్‌ మహేష్‌ పుట్టినరోజు కారణంగా.. రెండు రోజుల్లో వస్తానని చెప్పిన మహేష్‌ ఇలా విగతజీవిగా రావడం పై కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహేష్‌ ను తల్లిదండ్రులు అతి కష్టం మీద చదివించారు. ఇంటర్మీడియట్‌ లో మహేష్‌ ఆర్మీ కి ఎంపికయ్యాడు. 
 
ఆరేళ్లపాటు ఆర్మీ లో విధులు నిర్వహించారు. ఆర్మీలో ఒక కెప్టెన్‌గా ఉండాలన్న కోరికతో మహేష్‌ ఈ మధ్యనే ఓ పరీక్షను  కూడా రాసినట్లు తెలుస్తోంది. పరీక్షల్లో ఉత్తీర్ణుడవటంతో త్వరలో మహేష్‌ కు ప్రమోషన్‌ రావాల్సి ఉంది.
 
 ఈ నెల 21 న పుట్టిన రోజును పురస్కరించుకొని 12 వ తేదీన తన సొంతూరుకు మహేష్‌ రావల్సి ఉంది. ఇంతలోనే ఇలా జరగడం పై కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు రోదిస్తున్నారు.