దుబ్బాక ఫలితమే గ్రేటర్‌ హైదరాబాద్‌లో  

దుబ్బాక ఫలితమే గ్రేటర్‌ హైదరాబాద్‌లో పునరావృతం కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. కార్యకర్తల శ్రమ ఫలితం వల్లే దుబ్బాకలో బీజేపీ విజయం సాధించింది. కేసీఆర్‌ అహంకారానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు ఇదని పేర్కొన్నారు. 
 
టీఆర్‌ఎస్‌ ఓట్లను కొనుగోలు చేసి గెలిచే ప్రయత్నం చేసినా దుబ్బాక ప్రజలు బీజేపీని నమ్మి ఓటేసి గెలిపించారని కొనియాడారు. గోల్కొండ ఖిల్లాపై కాషాయజెండా ఎగురవేస్తామని భరోసా వ్యక్తం చేశారు. 
 
అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి అని టీఆర్‌ఎస్‌ ప్రచారం చేసిందని గుర్తు చేస్తూ . టీఆర్‌ఎస్‌ కులాల పేరుతో ప్రజలను విభజించిందని విమర్శించారు . 
 
బీజేపీ కార్యకర్తలను టీఆర్‌ఎస్‌ ఇబ్బందులకు గురిచేసిందని అంటూ  ప్రజలు ప్రశ్నిస్తారనే సీఎం దుబ్బాకలో ప్రచారం చేయలేదని ధ్వజమెత్తారు. యువకుల దమ్మేంటో టీఆర్‌ఎస్‌కు చూపించారని చెప్పారు. తెలంగాణ ప్రజలు రామరాజ్య స్థాపన కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. 
 
తెలంగాణలో రామరాజ్యస్థాపన బీజేపీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల అహంకారానికి దుబ్బాక ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తామని ప్రకటించారు. 
 
అమరవీరులను స్మరించుకోవడానికి కూడా తీసుకోవాలా  తీసుకోవాలా? అంటూ ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకునేలా దుబ్బాక ప్రజల తీర్పు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు కిలో మీటర్ దూరంలో బీజేపీ ఉందని పేర్కొన్నారు.   

కాగా, రానున్న మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ టపాసులు పేలుస్తుందని పార్టీ  రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాజకీయ ఫైర్‌వర్క్స్‌ ఎలా ఉంటాయో దక్షిణాది రాష్ట్రాల్లో, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చూడొచ్చని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు సమీప భవిష్యత్తులో బీజేపీ బ్రేక్‌ వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, దీనికి దుబ్బాక ఉపపోరే ఉదాహరణ అని బీజేపీ నేత రామ్‌మాధవ్‌తెలిపారు. దుబ్బాకలో విజయం సాధించిన రఘునందనరావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలోనూ బీజేపీ బలమైన శక్తిగా ఎదగబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

.