ఎస్వీబీసీలో పోర్న్‌సైట్‌ లింక్ కలకలం

తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక ఎస్వీబీసీ  ఛానెల్ లో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ చేశాడు. దీనికి జవాబుగా ఆ భక్తుడికి పోర్న్ సైట్ వీడియో లింక్ వచ్చింది. 
 
ఎస్వీబిసి ఉద్యోగి నుండి లింక్ రావడంతో ఆ భక్తుడు ఖంగుతిన్నాడు. దీనిపై వెంటనే టిటిడి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితోపాటు  ఈఓ జవహర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పై భక్తుడి నుండి ఫిర్యాదు రావడంతో టీటీడీ చైర్మైన్, ఈవో తీవ్రంగా స్పందించారు. 
 
వెంటనే ఎస్వీబీసీ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేశారు. టిటిడి విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఇతర అధికారులందరూ కలసి ఎస్వీబీసీలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. భక్తుడికి పోర్న్ సైట్ వీడియో లింక్ పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో పోర్న్ సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను సైబర్ క్రైమ్ టీం గుర్తించింది. 
 
కార్యాలయంలో విధులు నిర్వహించకూండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని గుర్తించారు. విధులు నిర్వహించకుండా వృధాగా కాలం గడుపుతున్నారని భాధ్యుల పై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్దమవుతోంది.