వీరజవాన్ ప్రవీణ్ కుటుంబానికి రూ 50 లక్షల సాయం 

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి (37) కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది.
 
చీకల ప్రతాప్‌రెడ్డి, సుగుణమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి 18 ఏళ్ల క్రితం మద్రాసు రెజిమెంట్‌, 18 మద్రాస్‌ ఆర్మీలో చేరారు. ఆయనకు భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నా రు. హవల్దారుగా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్‌ తీసుకున్నారు. 
 
 వీరజవాన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలుపుతూ లేఖ రాశారు. వీరజవాన్ ప్రవీణ్ కుమార్‌రెడ్డి ప్రాణత్యాగం వెలకట్టలేనిదని తెలిపారు. ప్రవీణ్ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేందుకు సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.50 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు లేఖలో సీఎం పేర్కొన్నారు.
 
ఇలా ఉండగా, ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 8 సంవత్సరాల క్రితం మద్రాస్ రెజిమెంట్ -18లో భారత సైన్యంలో చేరిన  ప్రవీణ్ కుమార్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ లో దేశ సరిహద్దులకు కాపలాగా ఉండి, బలిదానం పొందారని ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలిపిన గవర్నర్ ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
 
ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబాన్ని  మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబులు రెడ్డివారిపల్లెకు వెళ్లి ప్రవీణ్ కుటుంబీకులను పరామర్శించారు. 
 
ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సీఎం జగన్ ఆదేశాల మేరకు మేము వచ్చినట్లు మంత్రులు తెలిపారు. వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఉద్యోగం ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.