దుబ్బాక ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి రఘునందనరావు విజయం సాధించడంతో సర్వత్రా హర్తాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలను అభినందించారు.
బండి సంజయ్ నేతృత్వంలో దుబ్బాకలో విజయం సాధించిన రఘునందన్ రావుకు అభినందనలు తెలుపుతున్నట్లు జనసేన ట్విట్టర్‌లో ఓ ప్రకటన చేసింది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ పతాకం ఎగురవేయడంలో ఎంతో కృషి చేసిన బండి సంజయ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపింది.
ఆయన రాష్ట్ర బాధ్యతలు చేపట్టాక ఎదుర్కొన్న తొలి ఎన్నికలోనే పార్టీని విజయతీరానికి చేర్చారని కొనియాడింది. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం అవగతమవుతోందని జనసేన ప్రకటనలో పేర్కొన్నది.
దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌ను తిరస్కరించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. సిగ్గుంటే కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఫాంహౌస్‌కు కూతవేటు దూరంలో ఉన్న దుబ్బాక వెనుకబాటు సీఎంకు కన్పించలేదని విమర్శించారు.
టీఆర్‌ఎస్ వివక్ష పాలనను అందరూ గుర్తించారని తెలిపారు. ఎన్ని రకాలుగా భయపెట్టినా దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఓడించారన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్‌ను కుర్చీ దింపాలని ప్రజలు ఎదురు చూస్తున్నట్లు డీకే అరుణ పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ అహంకారపూరిత ధోరణులకు, కేసీఆర్ దొర గారి నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు అనికాంగ్రెస్ నేత విజయశాంతి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు ప్రభావితం కాకుండా పాలకులపై గూడు కట్టుకున్న వ్యతిరేకతను తమ ఓటుతో స్పష్టం చేశారని ఆమె తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అడ్డాను బీజేపీ బద్ధలు కొట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి దుబ్బాక ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కొనియాడారు. అతిగా ప్రవర్తిస్తోన్న కొందరు తెలంగాణ మంత్రులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దుబ్బాకలో జరిగిన అరాచకాలు ఎక్కడ జరగలేదని చెప్పారు.
బీహార్ లాంటి రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని గుర్తు చేశారు. రఘునందనరావు కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. దుబ్బాకలో రఘునందనరావు, బీజేపీ కార్యాకర్తలు వీరోచిత పోరాటం చేశారని అభినందించారు.
బీజేపీని కడుపులో పెట్టుకుని ఆదరించిన దుబ్బాకకు రుణపడి ఉంటామని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గెలుపునకు ప్రధాని మోదీ పాలనే కారణమని కిషన్ రెడ్డి తెలిపారు.
More Stories
బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు నెగ్గిన తెలంగాణ పంతం
విదేశీ కరెన్సీలో చెల్లింపులపై కేటీఆర్ పై ఈడీ ప్రశ్నలు
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు