హైదరాబాద్ లో 30  శాతం హిందువుల ఓట్లు తొలగింపు 

త్వరంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగున్నందున హైదరాబాద్ నగరంలో దాదాపు 30 శాతం హిందూ ఓటర్లను జాబితాల నుండి టి ఆర్ ఎస్ ప్రభుత్వం తొలగిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అదే సమయంలో ముస్లిం ఓట్లను పెంచుతున్నదని తెలిపారు. 

సోమ‌వారం మియాపూర్ నుంచి నాంపల్లి వరకు బండి సంజయ్ మెట్రో రైల్లో తొలిసారి ప్రయాణించిన ఆయన  అనంతరం మీడియాతో మాట్లాడుతూ  ఓటర్ జాబితాలో టీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు ధ్వజమెత్తారు. జి ఎచ్ ఎం సిలో హిందువుల ఓట్లు తగ్గించి- ముస్లిం ల ఓట్ల సంఖ్య పెంచారని మండిపడ్డారు.

మైనార్టీ ప్రాంతాల్లో హిందువుల ఓట్లు, హిందువుల ప్రాంతాల్లో మైనార్టీ ఓట్లు చేర్చి ఆక్రమణకు పాల్పడ్డార‌ని ఆరోపించారు. హైదరాబాద్ లో 9వేల హిందువుల ఓట్లు గల్లంతయ్యాయని, 30శాతం హిందువుల ఓట్లు తగ్గించి, ముస్లింల ఓట్లు పెంచారని దుయ్యబట్టారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి తలోంచి పనిచేస్తోందని సంజయ్ విమర్శించారు. ఎన్నికల కమిషన్ పై ప్రజలకు నమ్మకం లేకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఏం చెబితే అది ఎన్నికల కమిషన్ చేస్తున్నట్లు ప్రజలు అనుకుంటున్నార‌ని చెబుతూ  ఎన్నికల కమిషన్ చట్టానికి అతీతం కాదని స్పష్టం చేశారు. 

భాగ్యనగరాన్ని పాతబస్తీలా చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తుతూ  బీజేపీకి అవకాశమిస్తే పాతబస్తీని హైటెక్‌సిటీగా మారుస్తామని  హామీ ఇచ్చారు. చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికుందా? అని సంజయ్‌ ప్రశ్నించారు.

ఇటీవ‌ల కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ మునగలేదని, చెరువులు, నాళాల ఆక్రమణల వల్ల కాలనీలు మునిగాయని పేర్కొన్నారు. చెరువులు, నాళాల ఆక్రమణల పై విచారణ చేస్తే టీఆరెస్ పార్టీ నేతలు సగానికి పైగా జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు. 

ఎంఐఎం తో కలిసి సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో అంతర్గత సర్వే చేశార‌ని, బీజేపీ కి మంచి ఫలితాలు ఉన్నాయని తెలిసి ఎంఐఎం తో టీఆరెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో పాదయాత్రలు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, డివిజన్ల వారిగా పాదయాత్ర ఉంటుంద‌ని సంజ‌య్ తెలిపారు.