హాస్పిటల్‌ నుంచి రాజశేఖర్‌ డిశ్చార్జ్‌

హాస్పిటల్‌ నుంచి రాజశేఖర్‌ డిశ్చార్జ్‌
ఇటీవల కరోనా బారిన పడి, తీవ్ర అనారోగ్యంతో  సిటి న్యూరో సెంటర్‌లో చికిత్స తీసుకున్న సినీ హీరో రాజశేఖర్‌ ఆరోగ్యం కుదటపడటంతో సోమవారం ఆయనను హాస్పటల్ నుంచి డిశ్చార్జ్‌ చేశారు.
 
 సోమవారం ఉదయమే రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక ”నాన్నగారి ఆరోగ్యం స్లోగా మెరుగవుతోంది, ఖచ్చితంగా ఆయన కోలుకుంటారు.. నాన్న కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని ట్విట్టర్ వేదికగా తెలిపింది. 
 
ఆమె అలా తెలిపిన కొన్ని గంటలలోనే ఆయన హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వడంతో తెలుగు సినిమా పరిశ్రమ అంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక రాజశేఖర్‌ డిశ్చార్జ్‌ సందర్భంగా సిటి న్యూరో సెంటర్‌ సిబ్బందికి, డాక్టర్‌ కృష్ణకు జీవితా రాజశేఖర్‌ ధన్యవాదాలు తెలిపారు. 
 
ఒకానొక సమయంలో నటుడు రాజశేఖర్ పరిస్థితి విషమంగా కూడా మారిపోయింది. ఆయనతో పాటు కుటుంబం అంతా కరోనా బారిన పడ్డారు. అయితే కూతుళ్లు శివానీ, శివాత్మిక రాజశేఖర్‌తో పాటు జీవిత కూడా త్వరలోనే కరోనా నుంచి కోలుకున్నారు. అయితే రాజశేఖర్ మాత్రం కోలుకోలేదు.   పరిస్థితి చేదాటిపోయిందేమో అని భయపడ్డామని చెప్పింది జీవిత. అలాంటి పరిస్థితి నుంచి ఆయన కోలుకున్నాడు..
 
నెలరోజుల పాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబసభ్యుల్లా చూసుకున్నారని తెలిపిన జీవితా రాజశేఖర్ అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.