హైదరాబాద్‌లో వరదలు, దెబ్బతిన్న రహదారులు, కాలుష్య నియంత్రణ కోసం రాష్ట్రానికి కేంద్రం రూ.543.8 కోట్లు సాయం చేసింది. హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తినపుడు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి రూ.224.50 కోట్లు విడుదల చేశామని ప్రకటించింది. రాష్ట్రంలో దెబ్బతిన్న హైవేల మరమ్మతులకు రూ.202.30 కోట్లు ఇచ్చామంది.
హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు, వాయు నాణ్యత పెంచడానికి రూ.117 కోట్లు విడుదల చేసింది. 100 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని కోరగా ఒక్కో బస్సుకు రూ. కోటి రాయితీ ఇచ్చి 40 బస్సులను అందించింది. రెండో దశలో 500 బస్సులను త్వరలో అందించే అవకాశం ఉంది.
కరోనా విపత్తు వేళ ఆదాయం తగ్గి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్‌డీపీలో రూ.0.5 శాతం అప్పు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. తద్వారా తెలంగాణ ప్రభుత్వం రూ.5,017 కోట్లు అప్పు తీసుకునే వెసులుబాటు కలిగింది. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ పధకం కింద వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున అప్పు ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 73,625 మందికి లోన్లు ఇచ్చారు.
రాష్ట్రంలోని 10.74 లక్షల మందికి ఉజ్వల యోజనలో భాగంగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన కేంద్రం, కోవిడ్ నేపథ్యంలో వారందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసింది. ప్రధాన్‌మంత్రి జన్‌ధన్ ఖాతాలు ఉన్న రాష్ట్రంలోని 52 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.778 కోట్లు జమ చేసింది. కరోనా సమయంలో వలస కార్మికుల కార్మికులను ఆదుకునేందుకు రూ.224.50 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో 8 నెలల పాటు పేదలకు ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేసింది.
ప్రభుత్వం పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని చెప్తోన్న బియ్యం పంపిణీ పథకానికి కేంద్రం రూ.17,479.13 కోట్లు చెల్లించింది. రాష్ట్రంలో 1.91 లక్షల మందికి రేషన్ బియ్యం అందజేస్తోంది. 2016- -–17లో రూ.1,716 కోట్లు, 2017– -18లో 3,853 కోట్లు, 2018 -– 19లో రూ.4,858 కోట్లు, 2020–21లో సెప్టెంబర్ వరకు రూ.4,490 కోట్లు కేంద్రం సబ్సిడీ రూపంలో చెల్లించింది.
పట్టణ ప్రాంతాల్లోని పేదలు, మధ్య తరగతికి ఇండ్లు కట్టించేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) లో భాగంగా ఆరేళ్లలో రూ.2,237.37 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రూ.3,382.03 కోట్లతో 2,02,541 ఇండ్లను పథకంలో భాగంగా మంజూరు చేయగా ఇప్పటి వరకు 75,369 మందికి ఇండ్లు అందించామన్నాయి.
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను రూ.1,150 కోట్లతో ఆధునీకరించామని చెప్పాయి. ఈ హాస్పిటల్, మెడికల్ కాలేజీ భవనాలను కేంద్ర మంత్రులు సంతోష్ గంగ్వార్, కిషన్‌రెడ్డి ప్రారంభించారని, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు రెండో దశకు రూ.120 కోట్లు, ఘట్‌కేసర్ – యాదాద్రి ఎంఎంటీఎస్ ఫేజ్-2కు రూ.20 కోట్లు, ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.272 కోట్లు విడుదల చేశామని చెప్పాయి.
More Stories
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’
నల్గొండ బిఆర్ఎస్ కార్యాలయం కూల్చివేయాలని హైకోర్టు ఆదేశం
జానీ మాస్టర్ పై పోక్సో కేసు