దుబ్బాకలో బిజెపి సంచలన విజయం 

తెలంగాణలో అధికార పక్షం టి ఆర్ ఎస్ కు కంచుకోటగా భావించే దుబ్బాక నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఎన్ రఘునందనరావు సంచలన విజయం సాధించారు. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఓట్ల లెక్కింపులో చివరి వరకు నువ్వా… నేనా అన్నట్లు వచ్చిన ఫలితాలలో చివరకు 1400కు పైగా ఓట్ల ఆధిక్యతతో బిజెపి అభ్యర్థి గెలుపొందారు. 
 
బిజెపి అగ్రనేతలైన కేసీఆర్, కేటీఆర్, టి హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు సమీపంలోని ఈ నియోజకవర్గంలో 23 రౌండ్ల ఓట్ల లెక్కిపులో బిజెపి అభ్యర్థి 1754 ఓట్ల ఆధిక్యతతో బిజెపి అభ్యర్థి ఉన్నారు. పోస్టల్ ఓట్లను లెక్కిస్తే 1471 ఓట్ల ఆధిక్యతతో బిజెపి అభ్యర్థి ఉన్నారు. 
 
స్వయంగా హరీష్ రావు ముందుండి ఎన్నికల ప్రచారం నిర్వహించడమే  కాకుండా, బిజెపి అభ్యర్థిపై వ్యక్తిగత దాడులకు దిగారు. బిజెపి కార్యకర్తలను పోలీస్ కేసులతో వేధించారు. పోలీసుల దాడులతో భయానక వాతావరణం సృష్టించారు. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. 
 
అయితే గతంలో రెండు సార్లు ఇక్కడి నుండి ఓటమి చెందిన రఘునందనరావు, బిజెపి కార్యకర్తలు టి ఆర్ ఎస్ పాలనలో ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధిలో వెనుకబడితో ప్రజలకు చూపించారు. బిజెపి సారధ్యంలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 
 
తెలంగాణలో బిజెపి సాధించబోయే విజయాలకు ఈ ఎన్నిక నాంది  అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ స్పూర్తితో రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, గ్రాడుయేట్ల నియోజకవర్గాల నుండి ఎమ్యెల్సీ ఎన్నికలలో కూడా విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. ఇది పార్టీ కార్యకర్తల విజయం అని పేర్కొన్నారు. 
 
ఎన్నికల ఫలితాలు తాము ఆశించిన విధంగా లేవని టి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి రామారావు తెలిపారు.  పార్టీ నాయకులకు కనువిప్పు వంటిదని పేర్కొన్నారు. ఎక్కడ లోపం జరిగిందో సమీక్షించుకుంటామని చెప్పారు.