కరొనతో 24.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు 

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది చివరి త్రైమాసికంలో మరో పాతిక కోట్ల పూర్తి స్థాయి ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదముందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 2020వ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 8.6శాతం మేర పనిగంటలను నష్టపోయినట్లు ఐఎల్‌ఓ పేర్కొంది. 
 
గతంలో ఏ సంక్షోభ సమయాల్లోనూ లేనంత గడ్డు పరిస్థితిని ఈసారి వర్ధమాన దేశాల్లోని కార్మికులు ముఖ్యంగా అసంఘటిత రంగంలోని వారు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. నిరుద్యోగ స్థాయి కన్నా ఆర్థిక కార్యకలాపాల్లో స్తబ్ధత తీవ్ర పర్యవసానాలకు దారితీయనుందని ఐఎల్‌ఓ తెలిపింది. 
 
కరోనా కారణంగా ఏదో ఒక తరహా ఆంక్షలు అమలవుతున్న దేశాల్లో 94శాతం మంది కార్మికులు వున్నారు. ఎమర్జన్సీ సేవలు మినహా అన్ని రకాల ఉద్యోగాలు మూతపడిన దేశాల్లో 32శాతం మంది కార్మికులు వున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పనుల నుండి వచ్చే ఆదాయాలు 10.7శాతం తగ్గాయని అది వివరించింది. 
 
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో 3.5లక్షల కోట్ల డాలర్ల మేర ఈ నష్టం వుంది. కరోనా మహమ్మారిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గై రైడర్‌ కోరారు. 
 
ఆర్థిక, సామాజిక, కార్మిక రంగాల్లో ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత త్వరగా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఆదాయాలకు భరోసా ఇచ్చేలా ఉపాధి కల్పన, పారిశ్రామిక కార్యకలాపాల వృద్ధికి చర్యలు వుండాలన్నారు.