పాక్ విమానాలపై 188 దేశాలు నిషేధం!

పాకిస్తాన్‌కు చెందిన ఎయిర్‌లైన్స్‌ సంస్థలపై నిషేధం విధించాలని 188 దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్‌ లైసెన్సింగ్‌ సమస్యలు, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) నిర్దేశించిన ప్రమాణాలను పాటించడంలో పాక్‌ ఎయిర్‌లైన్స్‌ విఫలమవడమే ఇందుకు కారణం అని చెబుతున్నారు. 
 
లైసెన్స్ స్కాం  వల్ల పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్ ‌(పీఐఏ)పై బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌ ఇప్పటికే నిషేధం విధించాయి. 262 మంది పైలట్లు నకిలీ గుర్తింపు, ధ్రువపత్రాలు కలిగి ఉన్నారని పాకిస్తాన్‌ విమానయాన శాఖ మంత్రి ఆగస్టులో చేసిన ప్రకటనతో ఈ స్కాం బయటపడింది. వీరిలో పీఐఏకు చెందిన 141 మంది పైలట్లు ఉన్నారు. 
 
ఈ క్రమంలో ఇటీవల జరిగిన సమావేశంలో భద్రతా ప్రమాణాల విషయంలో ఐఏసీవో పాకిస్తాన్‌ విమానయాన ప్రాధికార సంస్థ(పీసీఏఏ)ను తీవ్రంగా హెచ్చరించింది. 
 
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పైలట్లకు శిక్షణ, లైసెన్స్‌ ఇవ్వడంలో పీసీఏఏ విఫలమైందని నవంబరు 3న ఐసీఏవో రాసిన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెందిన విమానాలు, పైలట్లపై 188 దేశాలు నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.