భావ వ్యక్తీకరణకు మాతృభాషకు సాటిలేదు

సమానత్వం, నాణ్యత, అందుబాటు ప్రాతిపదికన నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) రూపుదిద్దుకుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ పేర్కొన్నారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్యను బోధించడంలోని ప్రధాన ఉద్దేశం వివిధ ప్రాంతీయ భాషలతో కూడిన మన దేశ భిన్న సంస్కృతులకు పట్టం కట్టడమేనని కూడా ఆయన తెలిపారు. 

నూతన విద్యా విధానం అమలుపై అమిటీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభిస్తూ ఎన్‌ఇపి అమలుపై దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొందని చెప్పారు. నూతన విద్యా విధానం గతాన్ని భవిష్యత్తుతో ముడిపెడుతూ భారతదేశాన్ని అగ్రస్థానానికి చేర్చడంపై దృష్టిని నిలుపుతుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన స్వామి వివేకానంద సూక్తిని ఉటంకిస్తూ విద్యా రంగంలో భారతదేశం తన ఉన్నత లక్ష్యాలను సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మాతృభాష ప్రాముఖ్యాన్ని వివరిస్తూ భావవ్యక్తీకరణకు మాతృభాషకు మరే భాష సాటిరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉంటుందని, తదనంతరం విద్యార్థి తనకు ఇష్టమైన భాషలో చదువు సాగించవచ్చని ఆయన తెలిపారు. 

కొత్త విద్యా విధానం వల్ల ఇంగ్లీషులో వెనుకబడిపోతామన్న కొందరి అనుమానాలను ఆయన తోసిపుచ్చారు. మాతృభాషకే కట్టుబడిన జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇజ్రేల్ వంటి దేశాలు వెనుకబడి పోయాయా అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ పసలేని వాదనలని ఆయన కొట్టివేశారు.