అవకాశమిస్తే బంగారు బెంగాల్‌గా తీర్చిదిద్దుతాం 

అవకాశమిస్తే బంగారు బెంగాల్‌గా తీర్చిదిద్దుతాం 
బెంగాల్ అభివృద్దే తమ ధ్యేయమని పేర్కొంటూ తమకు అవకాశం ఇస్తే బంగారు బెంగాల్‌గా తీర్చిదిద్దుతామని సీనియర్ బీజేపీ నేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా  హామీ ఇచ్చారు.  రెండు రోజుల పశ్చిమ బెంగాల్ పర్యటన ముగింపు సందర్భంగా మాట్లాడుతూ ఒక్కసారి నరేంద్ర మోదీ నాయకత్వానికి రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని  బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

2010 లో మమతా బెనర్జీకి ప్రజలు అవకాశం కల్పించారని, ఆమె పాలనను, హామీలను చూసి ప్రజలు తీవ్ర నిరాశల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మమతా పాలనలో 100 కు పైగా బీజేపీ కార్యకర్తలు ఘోరంగా చంపబడ్డారని తెలుపుతూ ఈ హత్యలకు సీఎం బెనర్జీ తీసుకున్న చర్యలేమిటో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ హత్యల పరంపరపై టీఎంసీ ప్రభుత్వం ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని షా డిమాండ్ చేశారు.  కరోనా సమయంలో, వరదల సహాయంలోనూ తృణమూల్ సిగ్గులేకుండా అవినీతికి పాల్పడిందని ఆయన ధ్వజమెత్తారు. 

కేంద్రం తీసుకొచ్చిన పథకాలను రాష్ట్రంలో అమలు చేసే విషయంలో బెంగాల్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. మమత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలు తృణమూల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో 200 సీట్లు సాధిస్తామని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. దక్షిణేశ్వర దేవాలయాన్ని సందర్శిస్తూ బెంగాల్ సాంస్కృతిక వారసత్వం చాలా మహోన్నతమైనదని కేంద్ర హోంమంత్రి తెలిపారు. 

చైతన్య మహాప్రభు, స్వామి ప్రణవానంద, రామకృష్ణ పరమహంస, వివేకానంద లాంటి మహోన్నతులు పుట్టిన నేల అని కొనియాడారు. కానీ ‘సంతుష్టీకరణ’ రాజకీయాల వల్ల ఆ వారసత్వానికి దెబ్బ తగిలిందని మండిపడ్డారు. కోల్పోయిన కీర్తిని తిరిగి సంపాదించడానికి బెంగాల్ ప్రజలు తమ విధిని నిర్వర్తించాలని షా పిలుపునిచ్చారు.