భారత్ కు ఆందోళన కలిగించే బైడెన్ కు పాక్ తో మైత్రి 

అమెరికా అధ్యక్షుడిగా డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఎన్నిక కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో రెండు పర్యాయాలు ఆ దేశపు ఉపాధ్యక్షుడిగా భారత్ తో సంబంధాలను పటిష్ట పరుచుకోవడంలో కీలక పాత్ర వహించిన నేతగా మనకు సంతోషంగా కలిగిస్తున్నా పాకిస్థాన్ తో ఆయనకు గల సన్నిహిత సంబంధాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. 
 
భారత్ కు స్నేహితుడిగా తనను తాను చెప్పుకొంటూ వచ్చిన డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య సహాయకారంలో ఏమీ చేయనప్పటికీ పాకిస్థాన్ విషయంలో మాత్రం స్పష్టమైన వ్యక్తిరేకత వ్యక్తం చేస్తూ వచ్చారు. అనేక విషయాలలో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా భారత్ పక్షాన నిలబడ్డారు. 
గతంలో అమెరికా అధ్యక్షులు, విదేశాంగ కార్యదర్శులు భారత్ కు పర్యటనకు వచ్చినప్పుడు పాకిస్తాన్ కు కూడా తప్పనిసరిగ్గా వెడుతూ రెండు దేశాల మధ్య సమతూకం పాటించే ప్రయత్నం చేసేవారు. కనీసం మరో దేశంలో మధ్యలో ఆగడం ద్వారా భారత్ కు పూర్తి ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అయితే మొదటిసారిగా డోనాల్డ్ ట్రంప్ గత ఫిబ్రవరిలో నేరుగా భారత్ పర్యటనకు వచ్చి, తిరిగి వెనుకకు వెళ్లారు. 
 
ట్రంప్‌ హయాంలో గత నాలుగేళ్లలో పాక్‌ అనేక సమస్యలు ఎదుర్కొంది. ఉగ్రవాదం అణచివేత, భారత వ్యతిరేక కార్యకలాపాలు, అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా సైనికులపై దాడులను ఆక్షేపిస్తూ ట్రంప్‌ ముక్కుసూటితనంతో వ్యవహరిస్తూ వచ్చారు. ఆ దేశానికి ఆర్థిక సహకారం కూడా ఆపేశారు. ఈ నేపథ్యంలో ఆ దేశం కూడా బైడెన్‌ విజయాన్ని కాంక్షిస్తోంది.  

పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదం, పాకిస్థాన్ లో నెలకొన్న ఉగ్రవాద శిబిరాలు, భారత్ పైలట్ అభినందన ను బందీగా పట్టుకున్న సమయంలో, ఆర్టికల్ 370 రద్దు విషయంలో …. అనేక సందర్భాలలో భారత్ కు బాసటగా నిలిచారు. అయితే ఈ విషయంలో బైడెన్ ధోరణులు మాత్రం భిన్నంగా ఉంటూ వస్తున్నాయి.

తమ దేశంలో రెండో అతిపెద్ద పౌర పురస్కారమైన `హిలాల్-ఈ- పాకిస్తాన్’ ను 2008లో పాకిస్తాన్ బైడెన్ కు సెనెటర్ రిచర్డ్ లూగర్ తో పాటు బహుకరించింది. పాకిస్తాన్ కు 1.5 బిలియన్ డాలర్ల సైనికేతర సహాయం అందించడంలో కృషి చేసినందుకు ఈ పురస్కారం అందజేశారు. నిరంతరం పాకిస్థాన్ కు అండగా నిలబడుతున్న బైడెన్ ను అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ధన్యవాదాలు తెలిపారు. 
 
బైడెన్ ఎన్నికైతే అమెరికా- పాకిస్థాన్ ల మధ్య ఒకప్పటి మెరుగైన సంబంధాలను పునరిద్ధరిస్తారని పాకిస్థాన్ ప్రభుత్వం ఎదురు చూస్తున్నది. కేవలం దౌత్యసంబంధ అంశాలపైననే కాకుండా పలు బహిరంగ వేదికలపై నుండి ట్రంప్ పాకిస్తాన్ ధోరణులను ఖండిస్తూ వస్తున్నారు. ట్రంప్ హయాంలో రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణిస్తూ వచ్చాయి. 
 
ముస్లిం దేశాల నుండి వచ్చే పౌరులపై ఆంక్షలు విధిస్తు ట్రంప్ పలు చట్టాలు తీసుకు వచ్చారు. అందుకనే ట్రంప్ ఓటమి చెందాలని పాకిస్తాన్ కోరుకొంటూ వస్తున్నది. కాశ్మీర్ లో ముస్లింలు, బాంగ్లాదేశ్ లో రోహింగ్యాలు, చైనాలో ఉగ్గర్ ముస్లింలకు సంబధించిన అంశాలలో బైడెన్ మద్దతుగా ఉంటూ వచ్చారు. 
 
ఆర్టికల్ 370 రద్దు జరిగిన 10 నెలల తర్వాత గత జూన్ లో కాశ్మీరీ ప్రజల హక్కులను పునరుద్దరించాలని బైడెన్ భారత్ ను కోరారు. నిరసన తెలపడం, శాంతియుత ప్రదర్శనలు, ఇంటర్ నెట్ పై ఆంక్షలు విధించడం, ప్రజాస్వామ్యాన్ని బలహీనం కావించడం వంటి వాటిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.  
 
అయితే పాకిస్తాన్ తో సంబంధాలను పూర్తిగా పూర్వపు స్థాయికి తీసుకు వెళ్లడం బైడెన్ కు సాధం కాకపోవచ్చని, కానీ అంతర్జాతీయ సంస్థల్లో ట్రంప్ హయాంలో కుంచించుకు పోయిన అమెరికా పాత్రను పెంపొందింప చేయడం ద్వారా పరోక్షంగా పాకిస్థాన్ కు సహాయపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మారుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్ధిక పరిణామాలలో భారత్ తో సంబంధాలు మెరుగు పరచు కోవడం అమెరికాకు తప్పనిసరిగా పేర్కొంటున్నారు.