భారత రైతాంగ ఎజెండా రూపశిల్పి ఆచార్య రంగా

* 120వ జయంతి నివాళి 

స్వతంత్ర భారత దేశంలోనే కాకుండా, స్వతంత్ర ఉద్యమం సమయంలో సహితం రైతుల సమస్యలపై అవిరామంగా కృషి చేసిన మేటి నాయకుడు ఆచార్య ఎన్ జి రంగా అని చెప్పవచ్చు. ఎప్పుడో 1936లో అయన నేతృత్వంలో తయారు చేసిన `భారత రైతుల డిమాండ్లు’ ఇప్పటికి కూడా అదే విధంగా ఉన్నాయి. 
 
 రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా రైతుల విషయంపై వస్తే రంగా మాటలే శిరోరధ్యం కావలసిందే. ప్రపంచంలోనే సుదీర్ఘకాలం 60 ఏళ్ళ పాటు పార్లమెంట్ సభ్యుడిగా గిన్నిస్ రికార్డు కెక్కిన ఆయన అక్కడ ఏ పార్టీ సభ్యుడు రైతుల గురించి మాట్లాడినా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తుండేవారు. 
 
రంగా గారి అధ్యక్షతన అఖిల భారత కిసాన్ సభ ఏడు అంశాలతో రైతుల డిమాండ్ లను 1936లో తయారు చేసింది. ఈ డిమాండ్లను మద్దతుగా ఆయన నేతృత్వంలో రైతులు 200 కిమీ దూరం పాద యాత్ర జరిపి, మహారాష్ట్ర లోని  ఫిజాపూర్ లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు నివేదించారు. నేటికి కూడా ఇవే రైతులకు కీలక డిమాండ్లుగా మిగిలి ఉండడం గమనార్హం. 
ఈ కిసాన్ సభ రంగా అధ్యక్షతన 1926లో గుంటూరు లో ఏర్పడింది. అయితే 1942 నాటికి  కమ్యూనిస్టులు కిసాన్ సభను ఆక్రమించడంతొ ఆయన తన పదవికి రాజీనామా చేసి, మౌనంగా తప్పుకున్నారు. ఈ పాద యాత్ర ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభలో 40 వేల మంది పాల్గొన్నారు. అప్పట్లో ఈ సభ దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. 
 
ఈ డిమాండ్లపై నాటి కాంగ్రెస్ మహాసభలలో వాడి, వేడిగా చర్చలు జరిగాయి. జవహర్ లాల్ నెహ్రు వంటి నేతలు ఈ డిమాండ్లకు మద్దతు తెలిపారు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాటిని తిరస్కరించింది. ఇంతకు ఆ డిమాండ్లు ఏమిటి?

1. పెద్ద, పెద్ద వ్యవసాయ కమతాలను రద్దు చేయాలి. 2. అన్ని వ్యవసాయ రుణాలను రద్దు చేయాలి. 3. ప్రభుత్వం వద్ద గల బంజరు భూములు అన్నింటిని రైతులు, వ్యవసాయ కూలీలు పంపిణి చేయాలి. 4. వ్యవసాయ రంగంలో ఆదాయపన్ను విధించాలి. కేవలం వ్యవసాయం చేసేవారి ఆదాయంపై కొంతమేరకు మినహాయింపు కలిగిస్తూ, రైతువారి ఆదాయాలపై పన్ను విధించాలి. 5. కౌలు రైతులు అందరికి హక్కులు కల్పించాలి. 6. చౌకగా రుణ సదుపాయం, సరసమైన ధరలకు  విత్తనాలు అందించాలి. 7. వ్యవసాయ మార్కెట్ లలో ప్రైవేట్ వ్యాపారులు, దళారులను నిర్ములించడం కోసం సహకార మార్కెట్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. 
స్వతంత్రం రాగానే జమిందారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా పెద్ద, పెద్ద వ్యవసాయ కమతాలను రద్దు చేయడం జరిగింది. మిగిలిన డిమాండ్లు మాత్రం ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ విధంగా భారత రాజకీయ రంగం వ్యవసాయ సమస్యలపై దృష్టి సారింప చేయడం కోసం రంగా విశేషంగా కృషి చేశారు. 
 
1967 తర్వాత భారత గ్రామీణ రంగంలో తీవ్రమైన అశాంతి ఏర్పడినప్పుడు వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిపినా వారి డిమాండ్లు సహితం 1936 నాటి డిమాండ్లకు భిన్నంగా లేవు. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ రైతు నాయకులుగా పేరొందిన కమ్యూనిస్ట్ యోధులు సహితం రంగా గారి రాజకీయ పాఠశాలల్లో శిక్షణ పొందినవారే కావడం గమనార్హం.  
 
స్వాతంత్య్రం రాగానే జైపూర్ లో జరిగిన మొదటి కాంగ్రెస్ మహాసభలలో వ్యవసాయ సంస్కరణల కమిటీ ఒకదానిని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సవివరమైన నివేదికను సమర్పించింది. మొదటిసారిగా వ్యవసాయాన్ని లాభదాయకమైన ప్రవృత్తిగా మార్చడం గురించి సుదీర్ఘంగా ఈ కమిటీ చర్చించింది. 
 
ఈ కమిటీ సహకార వ్యవసాయం గురించిన ప్రతిపాదన తీసుకు వచ్చింది. దానికి  అనుకూలంగా,వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. 1969 వరకు రాజకీయ రంగంలో వ్యవసాయం గురించి ఈ విధమైన సమాలోచనలు జరుగుతూ వస్తున్నా, ఆ తర్వాత వ్యవసాయం తీవ్ర నిర్లక్ష్యంకు గురవుతూ వస్తున్నది. 
 
హరిత విప్లవం నుండి ఈ రంగంలో చేపట్టిన అనేక సంస్కరణలు, కార్యక్రమాలు అన్ని దేశంలో ఆహార కొరత లేకుండా చేయడం, వినియోగదారులకు చౌకగా ఆహార ధాన్యాలు అందించడం, పరిశ్రమలకు చౌకగా ముడి సరుకు అందుబాటులో ఉంచడమే లక్ష్యాలుగా ఉంటూ వస్తున్నాయి. కాని, రైతుల జీవన పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదు. 
 
రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కోసం అంటూ ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కీలకమైన మూడు వ్యవసాయ చట్టాలు సహితం అందుకు భిన్నంగా లేవని చెప్పవలసిందే. తన జీవితం అంతా రంగా రైతులు, వ్యవసాయ కూలీల జీవితాలలో వెలుగులు నింపడం కోసం ఎక్కడున్నా రాజీలేని కృషి చేస్తూ వచ్చారు. 
 
గుంటూరు జిల్లా నిడుబ్రోలు గ్రామంలో ఒక చిన్న వ్యవసాయ కుటుంభంలో నవంబర్ 7, 1890న జన్మించారు. ఐసిఎస్ పరీక్షలకు చదవడం కోసం బంధువులు, మిత్రుల సహకారంతో లండన్ వెళ్లిన ఆయన అక్కడకు చేరుకోగానే మహాత్మా గాంధీని బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసారని తెలుసుకొని ఆగ్రహం చెందారు. ఐసిఎస్ అధికారిగా అటువంటి ప్రభుత్వంలో తాను పనిచేయాలా అంటూ ఇంటికి వెళ్ళిపోతానన్నారు. 
 
అయితే మిత్రుల ప్రోత్సాహంతో అక్కడనే ఉండి అర్ధశాస్త్రంలో ఆక్సఫోర్ట్ యూనివర్సిటీ నుండి బి.లిట్ డిగ్రీ పొంది, తిరిగి వచ్చి మద్రాస్ లోని పచ్చపాస్ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు. కానీ గాంధీజీ పిలుపందుకొని ఉద్యోగం వదిలి, స్వతంత్ర సంగ్రామంలో చేరారు. 
 
కొద్దిపాటి పొలంపై వచ్చే ఆదాయంతో జీవనం సాగించడం కోసం తన పొలంలోనే ఒక చిన్న ఇల్లు వేసుకొని భార్యతో కలసి ఉంటూ, మాంసాహారం మానివేశారు. నేత వస్త్రాలు వేసుకునేవారు. చివరి వరకు  సదా,సీదా జీవనం గడిపారు. 
 
ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు సహితం పలు ఐరోపా దేశాలలో సెలవులలో పర్యటనలు జరిపి అక్కడి గ్రామీణ, వ్యవసాయ స్థితిగతులను అధ్యయనం చేశారు. భారత దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలో రైతు ఉద్యమాలకు స్ఫూర్తి కలిగిస్తూ వచ్చారు. స్వయంగా దేశం అంతటా పర్యటనలు జరుపుతూ రైతులను సమాయత్తం చేస్తుండేవారు. 
 
కేరళలో నంబూద్రిపాద్ కన్నా ముందే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కమ్యూనిస్ట్ లకు వచ్చింది. 1952లో కాంగ్రెస్ కు మెజారిటీ రాలేదు. 60 మంది వరకు ఉన్న కమ్యూనిస్ట్ సభ్యులు మరో కొన్ని పార్టీలతో కలసి ప్రభుత్వం ఏర్పాటును సిద్ధమయ్యారు. 
 
అయితే 20 మంది సభ్యులున్న కృషికార్ లోక్ పార్టీ అద్యక్షకుడిగా ఆచార్య రంగా కమ్యూనిస్ట్ లకు మద్దతు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేయడంతో సాధ్యంకాలేదు. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీలు ఆయనను చివరి వరకు క్షమించేవి కావు. చివరకు ఆంధ్ర రాష్ట్రంలో 1955 ఎన్నికలలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ముందే మంత్రివర్గం కూడా ప్రకటించారు. కానీ ఆచార్య రంగా, ప్రకాశం పంతులు కాంగ్రెస్ పార్టీలో చేరి కమ్యూనిస్టులు అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు. 
 
రంగా మద్దతుతోనే మద్రాస్ రాష్ట్రంలో రాజగోపాలాచారి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్భంగా తన శిష్యులైన తిమ్మారెడ్డి, గౌతు లచ్చన్నలకు మంత్రి పదవులు ఇవ్వమంటూ ఆయన రాజగోపాలాచారి వద్దకు వెళ్లారు. ఆ సందర్భంగా రంగాను ఉపముఖ్యమంత్రిగా  చేరమని ఆహ్వానించారు. తొందరలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది గదా, అప్పుడు తొలి ముఖ్యమంత్రి కావచ్చని చెప్పారు. 
 
కానీ ఆ ప్రతిపాదనకు రంగా ఆగ్రహం చెందారు. తన శిష్యులకు మంత్రిపదవులు అడిగితే తనకే పదవి ఇస్తానంటావా అన్నారు. అదే విధంగా ఇందిరా గాంధీ ఉపాధ్యక్ష పదవి లేదా మహారాష్ట్ర గవర్నర్ పదవి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. కానీ తనకు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటె చాలని, మరే పదవి అవసరం లేదని స్పష్టం చేశారు. 
 
ఒక సారి పార్లమెంట్ లో రైతుల సమస్యలపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఆచార్య రంగా ఇక్కడ ఉండగా తమ ప్రభుత్వం రైతులను విస్మరించగలదా అంటూ జవహర్ లాల్ నెహ్రు చెప్పడం గమనార్హం. ఆయన స్వతంత్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, మరో హోదాలో ఉన్నా ఆయన దృష్టి అంతా రైతుల సమస్యలపైననే ఉంటూ ఉండెడిది. 
 
1970 ప్రాంతంలో జన సంఘ్ కు గ్రామీణ ప్రాంతాలలో పట్టులేదని, వ్యవసాయ సమస్యలపై మాట్లాడేవారు పార్టీలో లేరని గ్రహించి, రంగాను పార్టీలో చేరమని ఆహ్వానించారు. నానాజీ దేశ్ ముఖ్ రెండు రోజులపాటు నిడుబ్రోలులో రంగా గారింట్లో ఉండి  పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని కూడా ప్రతిపాదించారు. కానీ ఎందుకో ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. 
 
కపటం లేకుండా మాట్లాడటం ఆయన తత్వం. నెహ్రు అయినా, ఇందిరా గాంధీ అయినా, రాజీవ్ గాంధీ అయినా మనసులో మాట మొఖం మీదనే చెప్పేయడం పరిపాటి. ఒక సారి పార్లమెంట్ లో ఇందిరాగాంధీ ఏదో మాట్లాడబోతుంటే “నీవు బాలికవు… నీకు రాజకీయాలు ఏమి తెలుసు” అంటూ కొంచెం కటువుగా మాట్లాడారు.