కీలక ఐరాస కమిటీకి భారత దౌత్యవేత్త మైత్ర ఎన్నిక

ఐక్య రాజ్య సమితి (ఐరాస)లో అత్యంత కీలకమైన అడ్వయిజరీ కమిటీకి భారతీయ దౌత్యవేత్త విదిశ మైత్ర ఎన్నికయ్యారు. ఇరాక్ అభ్యర్థిపై విదిశ గెలుపొందారు. ఐరాస సాధారణ సభలోని 193 దేశాలు ఈ ఎన్నికలో పాల్గొన్నాయి. 

ఆసియా పసిఫిక్ గ్రూప్‌లో ఈ కమిటీకి ఎన్నికయ్యేందుకు ఉన్న ఏకైక పదవి భారత దేశ దౌత్యవేత్తకు దక్కడం విశేషం. అడ్వయిజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ (ఏసీఏబీక్యూ)కు విదిశ మైత్ర ఎన్నికయ్యారు.  ఈ కమిటీలో ఆసియా పసిఫిక్ గ్రూప్‌కు ఉన్న ఏకైక పదవి ఇదే.

1946లో ఈ కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఈ కమిటీలో సభ్యత్వం భారత దేశానికి లభిస్తోంది. ఐరాసలో ఈ పదవికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఐరాస సెక్రటరీ జనరల్ సాధారణ సభలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను ఈ కమిటీ పరిశీలిస్తుంది. పరిపాలన, బడ్జెట్ సంబంధిత అంశాలపై సాధారణ సభకు సలహాలు ఇస్తుంది.

ప్రస్తుతం విదిశ న్యూయార్క్‌లోని ఐరాసకు భారత దేశ పర్మినెంట్ మిషన్‌లో ఫస్ట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐరాస భద్రతా మండలిలో నాన్ పర్మినెంట్ మెంబర్‌గా భారత దేశం వచ్చే ఏడాది నుంచి రెండేళ్లపాటు వ్యవహరిస్తుంది. ఈ తరుణంలో ఏసీఏబీక్యూలో సభ్యత్వం లభించడం సానుకూలాంశం.

ఈ పదవిలో విదిశ మూడేళ్ళపాటు కొనసాగుతారు. ఇదిలావుండగా, ఈ కమిటీ సభ్యులు తమ వ్యక్తిగత హోదాలోనే సేవలందిస్తారు, కానీ దేశానికి ప్రాతినిథ్యం వహించబోరు.