బాణసంచాపై నిషేధం పట్ల ఆగ్రహం 

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చరాదని ప్రభుత్వాలు ఆదేశించడంపై స్వదేశీ జాగరణ్ మంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాణసంచాపై పూర్తి స్థాయిలో నిషేధం విధించడం సరికాదని ఈ సంస్థ జాతీయ సహ సమన్వయకర్త డాక్టర్ అశ్వని మహాజన్ తేల్చి చెప్పారు. 

బాణసంచా వల్ల దుష్ఫలితాలు వస్తాయనే దుష్ప్రచారాన్ని నిలిపేయాలని ఆయన కోరారు. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చకుండా పూర్తి స్థాయిలో నిషేధం విధించడం సరికాదని చెప్పారు. వాస్తవ సమాచారం లేకుండా ప్రభుత్వాలు బాణసంచాపై నిషేధం విధించడం పూర్తిగా సరైనది కాదని ని ధ్వజమెత్తారు. 

పూర్తి స్థాయిలో నిషేధం విధించవద్దని ప్రభుత్వాలను ఆయన కోరారు. బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యానికి ప్రధాన కారణం చైనా నుంచి చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకున్న బాణసంచా అని ఆయన ధ్వజమెత్తారు.

చైనా బాణసంచాలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ కలుపుతారని చెప్పారు. మన దేశంలో తయారయ్యే బాణ సంచా కాలుష్య రహితమైనదని స్పష్టం చేశారు. మన దేశంలో తయారయ్యే బాణసంచాకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్  సర్టిఫికేట్ జారీ చేసినట్లు ఆయన గుర్తు చేశారు.