చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా యశ్‌వర్థన్ సిన్హా 

చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌ (సీఐసీ)గా యశ్‌వర్థన్ కుమార్ సిన్హా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సిన్హా చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ సిన్హా నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నారు. 

ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా పాత్రికేయుడు ఉదయ్ మహుర్కర్, మాజీ కార్మిక శాఖ కార్యదర్శి హీరాలాల్ సమారియా, మాజీ డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సరోజ్ పున్హనిలను ఈ కమిటీ ఎంపిక చేసింది. 

సీఐసీ పదవి ఆగస్టు 26 నుంచి ఖాళీగా ఉంది. బిమల్ జుల్కా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ పదవిని భర్తీ చేయలేదు. ఈ పదవిలో సిన్హా మూడేళ్ళపాటు ఉంటారు. 

సిన్హా గత ఏడాది జనవరి 1న ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. ఆయన గతంలో బ్రిటన్, శ్రీలంక దేశాలకు భారత దేశ హై కమిషనర్‌గా సేవలందించారు. 

కేంద్ర సమాచార కమిషన్‌లో 10 మంది కమిషనర్లను నియమించాలి. కొత్తగా ఎంపికైన ముగ్గురు బాధ్యతలు స్వీకరిస్తే కమిషనర్ల సంఖ్య 7కు చేరుతుంది. ప్రస్తుతం కమిషనర్లుగా వనజ సర్నా, నీరజ్ కుమార్ గుప్తా, సురేశ్ చంద్ర, అమిత పండోవ్ పని చేస్తున్నారు.