సభాహక్కుల ఉల్లంఘన కేసులో అర్ణబ్‌కు ఊరట  

మహారాష్ట్ర అసెంబ్లీలో తనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం (అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీ ఆమోదం) కేసులో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అర్ణబ్‌ను పోలీసులు అరెస్టు చేయకుండా కోర్టు రక్షణ కల్పించింది.

అసెంబ్లీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. తనపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించింది. నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో అర్ణబ్ రిపోర్టింగ్‌పై అభ్యంతరం చెప్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ఆమోదించారు.

దీనిపై అర్ణబ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అర్ణబ్ సుప్రీం కోర్టుకు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి ఆయనకు లేఖ రాశారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ సున్నితమైన అంశమని, వాటిని బయట పెట్టవద్దంటూ ఘాటుగా హెచ్చరించారు.

అర్ణబ్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ లేఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ కార్యదర్శికి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ఇలా లేఖ రాయడం చాలా తీవ్రమైన అంశమని, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది.