‘ఆర్‌ఆర్‌ఆర్’‌ అట్లాగే విడుదల చేస్తే థియేటర్లు దగ్ధం 

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ అట్లాగే విడుదల చేస్తే థియేటర్లు దగ్ధం 
`ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీమ్‌ వేషాధారణలో ఎన్టీఆర్‌ ఓ మతానికి సంబంధించిన టోపీ పెట్టుకోవడం ఆదివాసీయులను కించపర్చడమేనని బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు. అలాంటి సన్నివేశాలను తొలగించాలని, లేదంటే సినిమా థియేటర్లు తగలబెడుతామని హెచ్చరించారు.
కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహించిన కొమురం భీమ్‌ 80వ వర్ధంతి కార్యక్రమంలో బాబురావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. జల్ జంగల్ జమీన్ కోసం నిజాం సర్కార్ తో పోరాడి అసువులు బాసిన కొమురం భీమ్‌ వర్ధంతిని ఏటా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది.
ఈసారి కూడా జోడేఘాట్ కు ఉమ్మడి జిల్లా లోని గిరిజనులతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రల నుంచి భారీ గిరిజనులు తరలి వచ్చారు. మొదట గిరిజన సంప్రదాయ బద్దంగా పూజలు చేసిన అనంతరం భీమ్‌ సమాధి వద్ద నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావుతో పాటు జడ్పీ చైర్మన్ కోవా లక్ష్మీ, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కొనప్ప, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కోమురం భీమ్‌ మనవడు సోనే రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరోవంక, కుమ్రం భీం సినిమాను రాజమౌళి విడుదల చేస్తే సినిమా రీళ్లను తగులబెడతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. థియేటర్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎలా నడిపిస్తారో చూస్తామని తేల్చి చెప్పారు.
 
హిందూమతాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకోమని బండి సంజయ్ హెచ్చరించారు. తెలంగాణ గోండు వీరుడు కొమరం భీమ్‌ 119వ జయంతి సందర్భంగా  ‘ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం) చిత్రంలో ఎన్టీఆర్‌ లుక్‌ను, ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
 
కొమరం భీమ్‌ పాత్ర గురించి అల్లూరి సీతారామరాజు వెర్షన్‌లో సాగే ఈ టీజర్‌కు రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఈ టీజర్ చివర్లో.. కొమరం భీమ్ పాత్రలో ఉన్న ఎన్టీఆర్‌ ఓ మతానికి సంబంధించిన టోపీ పెట్టుకుని కనిపించాడు.