ఆర్జేడీ అంటే ఆటవిక పాలన అని అందరికీ తెలుసునని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఎద్దేవా చేశారు. తాజాగా విధ్వంసకర సీపీఐ-ఎంఎల్, కాంగ్రెస్‌లతో ఆర్జేడీ చేరిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల పాకిస్థాన్ అధికార ప్రతినిథిగా మారిందని అంటూ ఈ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
హాజీపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నడ్డా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ కూటమికి మూడింట రెండొంతుల ఆధిక్యత లభిస్తుందని, ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమకు లభించే స్థానాల సంఖ్య తగ్గే ప్రసక్తే లేదని, బీజేపీ, జేడీయూ, హెచ్ఏఎం, వీఐపీ కలిసికట్టుగా మూడింట రెండొంతుల ఆధిక్యత సాధిస్తాయని భరోసా వ్యక్తం చేశారు.
బిహార్‌లో ఎన్డీయే కూటమికి నేత నితీశ్ కుమారేనని బీజేపీ నడ్డా మరోసారి స్పష్టం చేశారు. శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ స్థానాలు లభించినప్పటికీ జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమారే తమ కూటమికి నాయకుడిగా కొనసాగుతారని చెప్పారు.
లాలూ ప్రసాద్ యాదవ్ తప్పుడు పరిపాలన, నితీశ్ కుమార్ అందించిన సుపరిపాలన ప్రజలకు గుర్తుందని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. నితీశ్ కుమార్ 15 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా పరిపాలించడం వల్ల కొందరు నిరాసక్తంగా కనిపించవచ్చునని చెప్పారు.
అయితే ప్రజలు ఆయన అనుభవాన్ని, మచ్చలేని, నిష్కళంక చరిత్రను గుర్తు చేసుకుని, ఆయన నాయకత్వాన్నే కోరుకుంటారని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కన్నా నితీశ్ కుమార్ ట్రాక్ రికార్డ్ నిష్కళంకమైనదని చెప్పారు.
More Stories
కోల్‌కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్‌తో ప్లాన్… ఐఎస్ కుట్ర!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఎబివిపి