ఉచిత వ్యాక్సిన్ హామీ నియమావళి ఉల్లంఘన కాదు 

బీహార్‌ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తామన్న హామీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని ఎన్నికల కమిషన్‌ (ఇసి) శనివారం స్పష్టం చేసింది. బిజెపి ఇచ్చిన ఈ హామీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందంటూ ఆర్‌టిఐ కార్యకర్త సాకేత్‌ గోఖలే ఇసికి ఫిర్యాదు చేశారు.  
 
ఈ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్‌ స్పందిస్తూ ఎన్నికల నియమావళిలోని పార్ట్‌ 8లోని ఎన్నికల మేనిఫెస్టోల కోసం ఎన్నికల కమిషన్‌ కొన్ని మార్గదర్శకాలను పేర్కొందని, ఈ మార్గదర్శకాలను అనుసరించి ఈ హామీ ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది. 
 
మేనిఫెస్టోలో హామీలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదని, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే విధంగా ఉండకూడదని, ఓటర్లపై ప్రభావం చూపకుండా ఉండాలని ఎన్నికల సంఘం మూడు సూచనలు చేసింది. నెరవేర్చడానికి సాధ్యంకాని హామీలపై మాత్రమే ఓటర్లు విశ్వాసం కోరాలని పేర్కొంది. 
 
కాగా,  బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తామంటూ బిజెపి తన మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని కూడా బిజెపి రాజకీయ లబ్థి కోసం వినియోగించుకుంటుందంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.