పాక్ ఉచ్చులో పడకండి… ప్రతిపక్షాలకు ప్రధాని హితవు 

పాకిస్తాన్ ఉచ్చులో ఎవ్వరు పడవద్దని ప్రతిపక్షాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు చెప్పారు. పుల్వామా దాడిని కొన్ని పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని అన్యాపదేశంగా ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
భారత తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ 145 జయంతి ( ఏక్తా దివస్‌) సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్‌లోని నర్మదా నది తీరంలోని కేవాడియా వద్ద ఐక్యతకు చిహ్నంగా నిర్మించిన  సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహం  వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. 
 
అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్‌ పరేడ్‌లో పాల్గొని జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగీస్తూ  ‘‘దేశానికి అంతపెద్ద గాయమైనప్పుడు వారు ఎలాంటి ప్రకటనలు చేశారో మనం చూశాం. అసభ్యకరమైన విషయాలు మాట్లాడారు.  ఆ సమయంలో నేను వివాదాస్పద ప్రకటనలు చేయకుండా మౌనంగా ఉండిపోయాను” అని తెలిపారు.
వారి మాటలతో తాను చాలా బాధపడ్డా అని చెబుతూ  అంతటి క్లిష్ట సమయంలో కూడా రాజకీయాలు చేసిన వారిని దేశం ఎన్నటికీ మరిచిపోదని హెచ్చరించారు. పార్లమెంట్‌లో ఓరకంగా ప్రమాణం చేస్తారని, కానీ ఆయా పార్టీల నిజమైన స్వరూపం ఆ సమయంలో బయటపడిందని ధ్వజమెత్తారు.
స్వార్థ రాజకీయాల కోసం ఎంత దూరమైన వెళ్లగలరన్నది నిరూపితమైందని మోదీ నిప్పులు చెరిగారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని, జవాన్ల మనోబలాన్ని దెబ్బతీసే రాజకీయాలు చేయవద్దని రాజకీయ పక్షాలను విజ్ఞప్తి చేశారు. ఆయా పార్టీల స్వార్థ రాజకీయాల కోసం వారికి తెలిసో, తెలియకో దేశ వ్యతిరేక శక్తుల చేతిలో పావులుగా మారకూడదని మోదీ స్పష్టం చేశారు.
ఉగ్రవాదంపై భారత్‌ నిరంతర పోరు సాగిస్తుందని చెబుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని  పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, హింసతో ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేరని పరోక్షంగా పాక్‌కు చురకలంటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని పేర్కొన్నారు.
ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ అభివృద్ధి పథంలో పయనిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించి, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పర్యాటక రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని తెలిపారు.
కరోనా సంక్షోభ వేళ దేశం మొత్తం ఐక్యంగా ఆ మహమ్మారితో పోరాడిందని.. అలాగే సర్దార్ పటేల్ కూడా దేశ ఐక్యత కోసం పోరాడారని మోదీ పేర్కొన్నారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిందని, దేశ పురోగతిని కూడా ప్రభావితం చేసిందని చెప్పుకొచ్చారు.
అయితే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశం తన సామాజిక బలాన్ని, శక్తిని ప్రదర్శించడం చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని ప్రధాని కొనియాడారు. 130 కోట్ల మంది భారతీయులు కోవిడ్ వారియర్స్ కు సత్కారాలు, గౌరవాలు అందించారని, అంతటి క్లిష్ట సమయంలో కూడా దేశం ఐక్యంగా తన శక్తిని చాటిందని పేర్కొన్నారు.
సోమనాథ క్షేత్ర పునర్నిర్మాణ ప్రక్రియ ద్వారా దేశ సాంస్కృతిక గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి పటేల్ ఓ పెద్ద యజ్ఞాన్నే చేశారని, దానికి కొనసాగింపే రామ మందిర నిర్మాణమని తెలిపారు. భవ్య రామ మందిర నిర్మాణాన్ని ఈ రోజు మనం చూస్తున్నామని  చెప్పారు.