సర్దార్ పటేల్ …. కాశ్మీర్ సమస్య

సర్దార్ పటేల్ …. కాశ్మీర్ సమస్య

రామ్ మాధవ్

నెపోలియన్ ఒకప్పుడు చరిత్రను “పరస్పరం అంగీకరించిన కథ” అని పిలిచాడు. మనం చరిత్రను కొన్నిసార్లు రాజకీయంగా, సైద్ధాంతికంగా సౌకర్యవంతంగా ఉండే ప్రసిద్ధ పురాణం అని పిలుస్తాము. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీన  చరిత్ర ఈ పురాణాల తయారీకి ఒక ముఖ్య ఉదాహరణ. అక్టోబర్ 26, 1947 న జరిగిన ఈ రాచరిక రాజ్యం భారత్ లో చారిత్రాత్మక విలీనం చుట్టూ చాలా పొగమంచు పేరుకుపోయి ఉంది.

ఇది కాశ్మీర్‌లోని నాయకులకు “షరతులతో కూడిన విలీనం” పురాణాన్ని పునరావృతం చేయడానికి అవకాశమిస్తుంది. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో చివరి అధ్యాయం 565 రాచరిక రాష్ట్రాలను ఆగస్టు 15, 1947 నాటికి రెండు దేశాలలో ఏదో ఒకదానిలో విలీనమయ్యేటట్లు చేయడం ఒక పెద్ద సవాల్ గా మిగిలింది.

“ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్” (విలీనంకు సాధనం) అని పిలువబడే ఒక పత్రం విలీనానికి ఆధారం. కాశ్మీర్ మహారాజా అదే విలీన పత్రంపై సంతకం చేశారు. షేక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) 1948 అక్టోబర్‌లో ప్రత్యేక సమావేశాన్ని విలీనంకు మద్దతుగా నిర్వహించింది. ఆ సమావేశం మరె ఇతర  పరిస్థితుల గురించి మాట్లాడలేదు. 

విలీనంకు మద్దతు ఇస్తూ, ఈ సమావేశం ఇలా చెప్పింది: “ఈ సమావేశం విలీనం ప్రశ్నను తీవ్రంగా ఆలోచించింది.  పరిణతి చెందిన పరిశీలన తరువాత, ఖచ్చితంగా కాశ్మీర్ పాకిస్తాన్‌లో సరైన స్థానాన్ని పొందలేదనే అభిప్రాయంకు వచ్చాము.  పాకిస్థాన్ నేడు ప్రతిచర్యలతో, క్షీణిస్తున్న భూస్వామ్యంకు కేంద్రంగా మారింది”.

లూయిస్ మౌంట్ బాటన్, సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మీనన్ అనే ముగ్గురు వ్యక్తులు భారతదేశ రాజకీయ సమైక్యతలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి మే 1947 లో బ్రిటిష్ ప్రభుత్వ రాజకీయ విభాగాన్ని “రాష్ట్రాల విభాగం” తో భర్తీ చేశారు. పటేల్‌ను మంత్రిగా, మీనన్‌ను పరిపాలనా అధిపతిగా చేశారు.

ఈ ముగ్గురు నాయకులు రాష్ట్రాల ఏకీకరణలో కీలక పాత్రలు పోషించినప్పటికీ, జర్మన్ ఐరన్ ఛాన్సలర్ ఒట్టో వాన్ బిస్మార్క్ తరహాలో, పటేల్‌కు `ఉక్కు మనిషి’  అనే పేరు వచ్చింది. 1871 లో జర్మన్ మాట్లాడే రాజ్యాలను ఐక్య జర్మనీలో విలీనం చేయడానికి ప్రష్యన్ జనరల్ అయిన బిస్మార్క్ బాధ్యత వహించారు.

ఈ ప్రయత్నంలో బిస్మార్క్ ఒంటరిగా ఉన్నాడు.  కాని అతను ఏకం చేస్తున్న రాజ్యాలు చిన్నవి. ఎక్కువగా నగర-రాష్ట్రాలు. ఈ పనిలో పటేల్‌కు మౌంట్ బాటెన్, మీనన్ సహాయం చేశారు, కాని ఆయన చాలా పెద్ద రాచరిక రాష్ట్రాలతో సైన్యాలు, శాసన సభలు, ఖజానాలతో వ్యవహరించాల్సి రావడంతో చాలా కఠినమైన సవాల్ ను ఎదుర్కోవలసి వచ్చింది. 

విలీనంల బాధ్యతను మంత్రివర్గం మౌంట్ బాటన్ కు అప్పచెప్పింది. జూలై 25, 1947 న ఆయా రాజ్యాధిపతుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆగస్టు 15, 1947 లోపు దాదాపు వారంతా విలీన పత్రాలపై సంతకాలు చేసేటట్లు చేయగలిగారు. 

అయితే అందుకు మూడు రాజ్యాలు సంతకం చేయడానికి నిరాకరించాయి. అవి హైదరాబాద్, జనాగఢ్, కాశ్మీర్. వీటిని విలీనం కావించడం పటేల్ బాధ్యతగా మారింది. వివిధ పద్దతులను అనుసరించి ఈ మూడింటిని కూడా చివరకు విలీనం కావించగలగడంతో పటేల్ కు `భారత్ బిస్మార్క్’  అనే పేరు వచ్చింది.

పటేల్ బలాన్ని లేదా బెదిరింపులను ఉపయోగించవలసి వచ్చిన హైదరాబాద్, జనాగఢ్ విలీనంలతో పోల్చుకొంటే కాశ్మీర్ విలీనం కొంచెం జఠిలమయినది. ఒకవైపు షేక్ అబ్దుల్లా పట్ల జవహర్‌లాల్ నెహ్రూకు ఉన్న అభిమానం, మరోవైపు స్వతంత్రంగా ఉండాలన్న మహారాజా హరి సింగ్ అభిలాష పటేల్ పనిని కష్టతరం చేసింది.

నెహ్రూ, పటేల్ – ఇద్దరు కూడా ఒక వంక మహారాజా తమ రాజ్యాన్ని భారత్ లో విలీనం చేస్తూ, మరోవంక అదే  సమయంలో అబ్దుల్లాతో స్నేహాన్ని పెంచుకోవాలని కోరుకున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వాకు చెందిన పాకిస్తాన్ గిరిజనులు అక్టోబర్ 22, 1947 న తన రాష్ట్రంపై దండెత్తి శ్రీనగర్ వైపు వెళ్ళే వరకు మహారాజా ఈ రెండు అంశాలపై విముఖత వ్యక్తం చేస్తూ వచ్చారు.

నవంబర్ 1, 1947 న జిన్నాతో మౌంట్ బాటెన్ జరిపిన సంభాషణలు, పాకిస్తాన్ దండయాత్రలో పాల్గొన్నట్లు వెల్లడించాయి. గిరిజన దండయాత్ర, పటేల్  ఒప్పించడం కారణంగా చివరికి మహారాజా విలీనం పత్రంపై సంతకం చేసి, ఆ పత్రాలను 1947 అక్టోబర్ 26 న మీనన్‌కు అప్పగించడానికి దారితీసింది. 

వెంటనే ఏమాత్రం జాప్యం చేయకుండా పటేల్ శ్రీనగర్ కు భారత సైన్యాన్ని పంపారు. ఆ  సంవత్సరం చివరినాటికి, ఆక్రమణదారులను జీలం మీదుగా వెనక్కి నెట్టారు. శీతాకాలం కారణంగా మరింత ముందుకు వెళ్లలేకపోయారు.

శీతాకాలం ముగిసే సమయానికి పాకిస్తాన్ సైన్యం సంఘటన స్థలానికి చేరుకోవడంతో, ఈ రోజు నియంత్రణ రేఖగా వర్ణించబడే  ప్రాంతం రెండు దేశాల మధ్య ప్రతిష్టంభనకు కారణమైనది.

పాకిస్తాన్ సైన్యం నేరుగా ప్రవేశించడంతో ఈ సమస్య అంతర్జాతీయ అంశంగా మారినదని అంటూ పటేల్ పరిధి నుండి ఈ అంశాన్ని తొలగించాలని నెహ్రు పట్టుబట్టారు. ఆ తర్వాత జరిగిన అనర్ధాలు అన్ని చరిత్ర. ఆ అనర్ధాలను సరిచేయడం కోసం ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

ఆ తర్వాత పటేల్ జనాగఢ్, హైదరాబాద్ ల విలీనంపై దృష్టి సారించారు. నవంబర్ 1947 లో జనాగఢ్ భారత్ లో విలీనం కాగా, హైదరాబాద్ విలీనం కోసం 1948 సెప్టెంబరులో పోలీసు చర్య అవసరమైనది. స్థానిక పాలకుల విముఖత ఎదురైనప్పటికి ఈ రెండు రాజ్యాలు ఎటువంటి సమస్యలు లేకుండా భారత్ లో సంపూర్ణంగా విలీనమయ్యేటట్లు పటేల్ చూడగలిగారు.

అయితే పటేల్ పరిధి నుండి తీసివేయబడిన కాశ్మీర్ మాత్రం సుదీర్ఘకాలం సమస్యలకు కేంద్రంగా మారింది. సర్దార్ పటేల్ మహాత్మా గాంధీకి నమ్మకమైన శిష్యుడు. ఆయనకు ఎటువంటి దురాశలు లేవు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏమి చేయాలి అనుకొంటున్నారని గాంధీ ఒక సారి అడిగితే తాను సాధువు అవుతాను అంటూ పటేల్ సమాధానం ఇచ్చారు.

పటేల్ వినమ్రత కారణంగా తన రాజకీయ నిచ్చెనలు సులభంగా అధిగమించడానికి నెహ్రూకు సాధ్యపడింది.  చరిత్రలో `అయితే’, `కానీ’ వంటి పదాలు ఉండవు. అయినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది రాజ్యసభలో ఇలా చెప్పారు, “సర్దార్ పటేల్ భారత ప్రధాని అయివుంటే జమ్మూ కాశ్మీర్ సమస్య ఉండేది కాదని మా నమ్మకం”.