పలు దేశాల్లో మళ్లీ భారీగా కరోనా కేసులు   

తగ్గినట్లే తగ్గి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ భారీగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. నెల క్రితం వరకు కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. అక్టోబర్‌ మధ్య నుండి మళ్లీ ఒక్కసారిగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది !

ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మందికిపైగా కరోనా సోకింది. వారిలో 11.5 లక్షల మందికి పైగా మృతి చెందారు. వైరస్‌ బారినపడినవారిలో 3 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. ప్రస్తుతం కోటి మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 90 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. బాధితుల సంఖ్య 92 లక్షలు దాటింది. కోవిడ్‌ బాధితులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి.

అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుపుకుంటున్న అమెరికాలో క‌రోనా వైర‌స్ మ‌రోమారు విజృంభిస్తున్న‌ది. నిన్న ఒక్క‌రోజే అగ్ర‌రాజ్యంలో 94 వేలకుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఒక్క‌రోజులో అత్య‌ధిక కేసుల రికార్డును అధిగ‌మించింది.

గురువారం రోజు దేశంలో 91 వేల‌కుపైగా క‌రోనా కేసులు రికార్డ‌య్యాయి. దేశంలో ప్ర‌స్తుతం 93,16,297 పాజిటివ్ కేసులు ఉండ‌గా, అందులో 2,35,159 మ‌ర‌ణించారు. మ‌రో 60,24,512 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 30,56,626 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 

ఐరోపాలో కరోనా కేసుల సంఖ్య కోటి మార్కును దాటిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరోపా ప్రాంత డైరెక్టర్‌ హన్స్‌ క్లూగే తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి ఐరోపా కేంద్ర బిందువుగా మారిందన్న క్లూగే కేవలం వారం రోజుల వ్యవధిలోనే 30 శాతం మరణాలు పెరిగాయని ఆందోళన వ్యక్తపరిచారు. 

ఫ్రాన్స్‌లో గురువారం ఒక్కరోజే 47 వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా కరోనా బాధితుల సంఖ్య 12 లక్షలు దాటింది. రెండో సారి కరోనా చెలరేగుతుండటంతో.. ఫ్రాన్స్‌ వణికిపోతోంది. మరోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది.

బ్రెజిల్‌లో కరోనా ఉధృతి కాస్త కూడా తగ్గడం లేదు. ఒక్కరోజులోనే 30 వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 6 లక్షలు దాటింది. నేపాల్‌లో గడిచిన 24 గంటల్లో 3,517 కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో కొత్తగా 24 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు.

ఇటలీలోనూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. గల్ఫ్‌ దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇరాన్‌లో ఒక్కరోజులోనే 8 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. జర్మనీ లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించేందుకు అక్కడి అధికారులు సిద్ధమవుతున్నారు. బెల్జియం, ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌, ఐర్లాండ్‌, పోలండ్‌ దేశాల్లో ఆంక్షలు కొనసాగుతోన్నాయి. భారత్‌లో మాత్రం క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టడం గమనార్హం.

పారిస్‌ వీధులన్నీ శుక్రవారం నిర్మానుష్యంగా మారాయి. మళ్లీ విజృంభిస్తోన్న కరోనా ధాటికి పారిస్‌ వణికిపోతోంది. ఈ మహమ్మారితో పోరాడేందుకు 4 వారాలపాటు లాక్‌డౌన్‌ను విధించారు. పారిస్‌ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రోజుకు ఒక గంట సేపు వ్యాయామం, వైద్య సాయం, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతిస్తున్నారు. ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో నగరం బయటకు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతోంది.