దుబ్బాక ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి 

దుబ్బాక ఉప ఎన్నికను సవాల్​గా తీసుకున్న బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నది. సిద్దిపేట సంఘటనతో క్షేత్రస్థాయి  కేడర్​ నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం ​ దాకా అందరూ  ఉపఎన్నికపై ​ మీదే స్పెషల్​  ఫోకస్​ పెట్టారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న  కసి వారిలో కనిపిస్తున్నది. వారం రోజులుగా నియోజకవర్గంలోని ప్రతి చోటా సభలు, సమావేశాలు, రోడ్​షోలు నిర్వహిస్తున్నారు. 

ముఖ్య నేతలందరూ ప్రచారంలో పాల్గొంటుండటం పార్టీ   కేడర్​లో జోష్​ను  పెంచుతున్నది. ఇతర ప్రాంతాల కార్యకర్తలు  కూడా స్వచ్ఛందంగా దుబ్బాకకు వచ్చి ఊరూరా ప్రచారం చేస్తున్నారు.  ప్రతి ఇంటికి వెళ్లి. తమ అభ్యర్థి రఘునందన్​రావుకు ఓటు వేయాలని కోరుతున్నారు. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ​ బండి సంజయ్, ఎంపీలు అర్వింద్, బాపూరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ సీనియర్ నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, జితేందర్​రెడ్డి, బాబూమోహన్​తో పాటు ఇతర నేతలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.

డబుల్​ బెడ్రూం ఇండ్ల పథకం సహా ఆరేండ్లలో  అమలు కాని టీఆర్​ఎస్​ హామీలను ఓటర్లకు వివరిస్తున్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారంటూ లెక్కలతో వెల్లడిస్తున్నారు. అదే సమయలో ప్రధాని మోదీ చేబడుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్ర పథకాల్లో కేంద్రం వాటాను ఇంటింటికి వెళ్లి చెప్తున్నారు. టీఆర్​ఎస్​ విమర్శలకు దీటుగా బదులిస్తున్నారు.

దీంతో ఓటర్ల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుండటం బీజేపీ కేడర్​లో నూతనోత్సాహం నింపుతున్నది. పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుకు దుబ్బాకతో మంచి అనుబంధం ఉండటం, ఏసమయంలోనైనా జనానికి అందుబాటులో ఉంటారన్న పేరు ఉండటం, గతంలో అసెంబ్లీ, లోక్​ సభ ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతికి తోడు మోదీ  పాలనపై ప్రజల్లో ఉన్న సానుకూలత ఉపఎన్నిక​లో కలిసి వస్తుందని, తమదే గెలుపని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.

వారం కిందట సిద్దిపేటలో రఘునందన్​రావు బంధువులు, ఇతరుల ఇండ్లపై పోలీసులు చేపట్టిన సోదాలు, ఈ సందర్భంగా తలెత్తిన వివాదాలు,  లాఠీచార్జ్​, అరెస్టులు తీవ్ర దుమారం రేపాయి. అక్కడికి వెళ్లిన తనపై పోలీసులు దాడి చేయడాన్ని  నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ దీక్షకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ పరిణామాలతో దుబ్బాక ఉప ఎన్నిక  హీట్​ రాష్ట్రానికంతటికీ పాకింది.

టీఆర్​ఎస్ నేతలంతా బిజెపి లక్ష్యంగా ప్రచారం చేసుండడం గమనిస్తే వారిలో ఓటమి భయం ఏర్పడిందనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. బిజెపినే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ అధికార పార్టీ అగ్రనేతలు బిజెపి కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారు.