మహారాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యంకు ముప్పు 

ఓ సామాన్యుడి పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అనీ బిజెపి ఎంపీ వరుణ్ గాంధీ ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరేలపై విమర్శలు చేసి అరెస్ట్ అయిన సోషల్ మీడియా యూజర్ సుమీత్ ఠక్కర్‌కు బాసటగా నిలుస్తూ  ఆయనపై తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధమని మండిపడ్డారు.
 
ట్విటర్లో దాదాపు 62 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న సుమీత్ టక్కర్‌ను తాడుతో కట్టేసి, ముఖానికి ముసుగువేసి కోర్టులో ప్రవేశపెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
దీనిపై వరుణ్ గాంధీ ట్విటర్లో స్పందిస్తూ… ‘‘సమీత్ ఠక్కర్ ఏమైనా టెర్రరిస్టా? ఆయన ఏమైనా జంతువా? ఆయన వల్ల దేశానికి ఏమైనా ప్రమాదమా? మరి  ఠక్కర్ పట్ల ఎందుకిలా వ్యహరిస్తున్నారు?”  అని ప్రశ్నించారు. మానవత్వానికి పూర్తి వ్యతిరేకమిది. రాజకీయ కోణాలను పక్కనబెడితే.. ఇలాంటి చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధం. అనైతికం. దీనికి వ్యతిరేకంగా మనమంతా గళం విప్పాలని పిలుపిచ్చారు. 
 
ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు ఆదిత్య థాక్రేలను ట్విటర్లో విమర్శించినందుకు గత వారంలో సమీత్ ఠక్కర్‌ను అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నా ఉద్ధవ్ అసమర్థ పాలన చేస్తున్నారని, ఆయనో పెంగ్విన్ సీఎం అని ఠక్కర్ ట్వీట్ చేశారు. ఆయన కుమారుడు ఆదిత్య థాక్రేను బేబీ పెంగ్విన్ అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. దీంతో పోలీసులు సమీత్‌ను అరెస్ట్ చేశారు.