స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు మహమ్మారి బారినపడి కోలుకోగా.. మరికొందరు మృత్యువాతపడ్డారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి మహమ్మారి బారినపడ్డారు. 
 
దీంతో ఆమె సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తనను క‌లిసిన వారంతా వెంటనే కరోనా టెస్టులు నిర్వహించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 
 
‘‘ఓ ప్రకటన చేసే క్రమంలో పదాల కోసం వెతకడం నాకు చాలా అరుదు. అందుకే నేను చాలా సరళంగా చెబుతున్నా. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.
 
ఇంతకు ముందు కేంద్ర మంత్రులు అమిత్‌షా, పహ్లాద్‌జోషి, నితిన్‌ గడ్కరీ, ధర్మేంద్ర ప్రదాన్‌, అర్జున్‌రామ్‌, యశోనాయక్‌ శ్రీపాదతో పాటు మరికొందరు మంత్రులు, పదుల సంఖ్యలో ఎంపీలు మహమ్మారి బారినపడ్డారు.  
కాగా, దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు నిత్యం 50వేల నుంచి 60వేలకుపైగా పాజిటివ్‌ నమోదు అవుతుండగా.. తొలిసారిగా గడిచిన 24గంటల్లో 49,881 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. 
 
కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 80లక్షల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 80,40,203కు చేరాయి. తాజాగా 517 మంది మహమ్మారి కారణంగా మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,20,527కి చేరింది. గత 24గంటల్లో 56,480 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 73,15,989 మంది కోలుకోగా 6,03,678 యాక్టివ్‌ కేసులున్నాయి.
 
ఇదిలా ఉండగా.. బుధవారం ఒకే రోజు 10,75,760 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 10,65,63,440 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.