పాక్ ఆర్మీ చీఫ్‌ బాజ్వాకు వణుకు పుట్టించిన అభినందన్  

వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విషయంలో పాక్ ఆర్మీ చీఫ్‌ బాజ్వాకు వెన్నులో వణుకు పుట్టిందా? ఒకవేళ అభినందన్‌ను విడిచిపెట్టకపోతే భారత్ తమపై దాడికి సిద్ధమైందన్న వార్త వినగానే బాజ్వా కాళ్లు గజగజ వణికిపోయాయా? అంటే అవుననే అంటున్నాయి పాక్ వర్గాలు.

అభినందన్ వర్ధమాన్‌ను అరెస్ట్ చేయగానే పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఖురేషీ మాట్లాడుతూ  ‘‘భారత్ మనపై దాడికి దిగుతుంది’’ అని నేతలతో ప్రస్తావించారట. ఆ సమావేశంలో ఆర్మీ చీఫ్ జావేద్ బాజ్వా కూడా పాల్గొన్నారు.

 ‘‘భారత్ దాడి చేస్తుందన్న మాట వినగానే బాజ్వా కాళ్లు గజగజ వణికిపోయాయి’’ అని అదే సమావేశంలో పాల్గొన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత అయాజ్ సాదిఖ్ వెల్లడించారు.

గ‌త ఏడాది పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడి త‌ర్వాత‌.. పాకిస్థాన్‌పై భార‌త వైమానిక ద‌ళం దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ దాడిలో వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ పాకిస్థాన్ ఆర్మీకి చిక్కాడు. అయితే ఇమ్రాన్ ఖాన్  ప్ర‌భుత్వం గ‌త ఏడాది మార్చి ఒక‌టో తేదీన పైల‌ట్‌ అభినంద‌న్‌ను విడిచి పెట్టింది. 

వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌ను విడిచిపెట్టేందుకు దారితీసిన ప‌రిణామాల‌పై పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్‌-ఎన్‌) నేత అయాజ్ సాదిక్ ఆ దేశ జాతీయ అసెంబ్లీలో తాజాగా ఆసక్తికర  విష‌యాల‌ను వెల్ల‌డించారు.

సాదిఖ్ మాట్లాడుతూ ‘‘వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేయకపోతే ఈ రాత్రి 9 గంటలకు భారత్ మనపై దాడి చేస్తుందని విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ పేర్కొన్నారు. ఇప్పటికీ నాకు జ్ఞాపకముంది. ఈ సమావేశానికి రావడానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరాకరించారు. అయితే విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ మాత్రం హాజరయ్యారు” అంటూ గుర్తు చేసుకున్నారు. 

“ఆ సమయంలో ఆర్మీ చీఫ్ బాజ్వా కూడా సమావేశంలో ఉన్నారు.  దయచేసి అభినందన్‌ను వదిలి పెట్టండి. లేదంటే రాత్రి 9 గంటలకు భారత్ మనపై దాడి చేస్తుంది అని మంత్రి ఖురేషీ హెచ్చరించారు. ఆ సమయంలో బాజ్వా కాళ్లు గజగజ వణికిపోతున్నాయి. ముచ్చెమటలు పట్టాయి.’’ అని వెల్లడించారు.

వింగ్ క‌మాండ‌ర్‌ను వ‌దిలేందుకు విప‌క్షాలు కూడా స‌హ‌క‌రించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  పుల్వామా దాడి అనంత‌రం జ‌రిగిన యుద్ధ విమానాల డాగ్ ఫైట్‌లో.. పాక్‌కు చెందిన ఎఫ్‌-16 విమానాన్ని అభినంద‌న్ నేల‌కూల్చాడు. ఆ త‌ర్వాత అత‌ను పాక్ ఆర్మీ ద‌ళాల‌కు చిక్కాడు.  పైల‌ట్‌ అభినంద‌న్‌కు వీర చ‌క్ర అవార్డు ఇచ్చి భార‌త ప్ర‌భుత్వం అత‌న్ని స‌త్క‌రించింది.