గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ (92) చనిపోయారు. బీజేపీ సీనియర్ నేత అయిన కేశూభాయ్ గుజరాత్‌కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. గురువారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కేశూభాయ్‌ను చేర్చారు.
అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాసను విడిచారు. జాతీయ మీడియా ప్రకారం.. కేశూభాయ్‌కు సెప్టెంబర్‌లో కరోనా సోకిందని సమాచారం. ఆయనకు అసింప్టోమేటిక్ కరోనాగా తెలుస్తోంది.
సెప్టెంబరు 30న సోమనాథ్ మందిర్ ట్రస్ట్‌కు రెండవసారి అధ్యక్షునిగా ఎంపికయ్యారు. 1930 జూలై 24న జన్మించిన కేశూభాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత. గుజరాత్‌కు 1995 మార్చి నుంచి 1995 అక్టోబరు వరకు మొదటి పర్యాయం, 1998 మార్చి నుంచి 2001 అక్టోబరు వరకు రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నారు.
2001లో గుజరాత్‌లో జరిగిన ఉపఎన్నికలలో బీజేపీకి ఆశించిన స్థాయిలో విజయం లభించలేదు. దీంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగాలని కేశూభాయ్ పటేల్‌పై ఒత్తిడి రావడంతో పదవి నుంచి తప్పుకున్నారు. అయన స్థానంలో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయ్యారు.
ఆయన అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నికయ్యారు. 2012లో బీజేపీని వీడిన ఆయన.. స్వంతంగా గుజరాత్ పరివర్తన్ పార్టీని స్థాపించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభావాన్ని చవిచూసింది. అయితే మళ్లీ 2014లో ఆ పార్టీ బీజేపీలో చేరింది.
జునాఘడ్ జిల్లాలోని విసావాదర్ పట్టణంలో కేశూభాయ్ 1928లో జన్మించారు. 1945లో ఆయన ఆర్ఎస్ఎస్‌లో చేరారు. జన్ సంఘ్‌లో కార్యకర్త ద్వారా రాజకీయ కెరీర్‌ను ప్రారంభించారు.
ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో వీడియో సందేశాన్ని పోస్టు చేసిన మోదీ తన వంటి ఎందరో కార్యకర్తలను కేశూభాయ్ తీర్చిదిద్దారని గుర్తు చేసుకున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడేవారని అంటూ కేశూ కుమారుడు భరత్‌తో మాట్లాడినట్లు ప్రధాని మోదీ తన వీడియో ట్వీట్‌లో తెలిపారు.
గుజరాతీ నేలకు చెందిన ప్రియతమ నేత కేశూభాయ్ మరణ వార్తను ఊహించలేకపోతున్నట్లు చెప్పారు. దేశ భక్తి లక్ష్యంతో కేశూ పనిచేశారని చెబుతూ ఆయన వ్యక్తిత్వం, వ్యవహారంలో సౌమ్యత, నిర్ణయాలు తీసుకోవడంలో దృఢ నిశ్చయ శక్తి అచంచలమైందని కొనియాడారు.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కేశూభాయ్.. రైతులు, పేదల కష్టాలను అర్థం చేసుకునేవారని, కేశూ వివిధ హోదాల్లో తన నిర్ణయాలతో రైతులకు ఎంతో మేలు చేశారని పేర్కొన్నారు. రైతుల జీవితాలను సులభతరం చేశారని చెప్పారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు