వాయు కాలుష్యంకు ఐదేళ్ళ జైలు, రూ.1 కోటి జరిమానా   

వాయు కాలుష్య కారకులకు కఠిన శిక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలపడంతో బుధవారం రాత్రి నుంచి ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. వాయు కాలుష్య కారకులకు గరిష్ఠంగా ఐదేళ్ళ జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించేందుకు ఈ ఆర్డినెన్స్ అవకాశం కల్పించింది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా ఉంది. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా త్వరలోనే కఠిన చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. 

ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల రైతులు వరి దుబ్బులను కాల్చడంపై నిషేధం విధించాలని ఈ వ్యాజ్యం కోరింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం, దేశ రాజధాని నగరంతోపాటు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు.

ఈ ఆర్డినెన్స్ నిబంధనలను, కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించినవారిని గరిష్ఠంగా ఐదేళ్ళ జైలు శిక్ష లేదా రూ.1 కోటి వరకు జరిమానా లేదా ఈ రెండు శిక్షలతో శిక్షించవచ్చు.  కమిటీ చైర్మన్‌ను పర్యావరణం, అడవుల శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా రవాణా, వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులు, కేబినెట్ సెక్రటరీ వ్యవహరిస్తారు.

ఈ కమిషన్ గాలి కలుషితమవడానికి దోహదపడుతున్న అంశాలను పరిశీలిస్తుంది. వరి దుబ్బుల కాల్చివేత, వాహన కాలుష్యం, ధూళి కాలుష్యం, గాలి నాణ్యతను క్షీణింపజేసే ఇతర అంశాలను పరిశీలిస్తుంది. ఈ కమిషన్ వార్షిక నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తుంది. కమిషన్ ఆదేశాలపై సివిల్ కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదు, కేవలం జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)లోనే సవాలు చేయవచ్చు.