ఓటమి భయంతో కేసీఆర్ మైండ్ గేమ్

దుబ్బాకలో ఓడిపోతామని తెలిసి సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్నిక‌ల స‌ర్వేలో టీఆర్ ఎస్ ఓడిపోతుంద‌ని తేల‌డంతోనే అక్క‌డ అరాచాకాల‌ను ఆ పార్టీ పాల్ప‌డుతోదని ఆరోపించారు.

సిద్దిపేట‌లో పోలీసుల చ‌ర్య‌ను నిర‌సిస్తూ బీజేపీ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ క‌రీంన‌గ‌ర్ లోని త‌న కార్యాల‌యంలో నిరసనకు దిగారు. సంజయ్ ను డీకే అరుణ ప‌రామ‌ర్శిస్తూ గెలుపు కోసం పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ కుట్రలు చేస్తోంద‌ని ఆరోపించారు. 

ఎన్నికల కోడ్ లేని సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థుల బంధువుల ఇళ్లలో సోదాలు జ‌ర‌ప‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని విమ‌ర్శించారు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామ‌ని ఆమె హామీ ఇచ్చారు.  

మఫ్టీ పోలీసులతో టీఆర్ఎస్ నాటకం

మఫ్టీ పోలీసులతో టీఆర్ఎస్ నాటకం ఆడుతోందని  దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ధ్వజమెత్తారు. బీజేపీకి కార్యకర్తలే బలమని చెబుతూ  తమ మౌనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. దుబ్బాకలో నేతలను బెదిరిస్తున్నారని.. పించన్లు రావంటూ భయపెడుతున్నారంటూ ఆరోపించారు. 

సమాచారం లేకుండా తనిఖీలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.  రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. సిద్దిపేట సీపీకి చట్టం తెలియదా..మేం దేశద్రోహులమా ? దొంగలమా ? అని ప్రశ్నించారు. హరీశ్ రావు  సూచనలతోనే సీపీ పని చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధిపేట నుంచి దుబ్బాకకు జనాన్ని దింపారని చెబుతూ బీజేపీకి బలం లేకపోతే టీఆర్ఎస్ కు ఉలికిపాటు ఎందుకని ప్రశ్నింరావు చారు.

హరీశ్ మర్యాదగా మాట్లాడితే మంచిదని హితవు చెప్పారు. దుబ్బాకలో టీఆర్ఎస్ నేతలు లేరా సిద్దిపేట కౌన్సిలర్లు దుబ్బకకు ఎందుకు వచ్చారని నిలదీశారు. నీ అభివృద్ధిపై నీకు నమ్మకం లేదా  అని ప్రశ్నించిన రఘునందన్ ప్రజల్ని స్వేచ్చగా ఓట్లు వెయ్యనివ్వండని కోరారు.