దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, ఆయన కుటుంభ సభ్యులు, బంధువులు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తో సహా బిజెపి ప్రధాన ప్రచార నేతలపై పోలీసులు, రాష్ట్ర పాలనా యంత్రాంగం సాగిస్తున్న వేధింపుల విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని భారత ఎన్నికల కమీషన్ ను బిజెపి డిమాండ్ చేసింది. స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు.
బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి, ఎమ్యెల్సీ ఎన్ రామచంద్రరావుల నేతృత్వంలో పార్టీ ప్రతినిధి వర్గం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ శశాంక్ గోయల్‌ను కలసి ఈ విషయమై ఒక వినతి పత్రం సమర్పించింది. సోమవారం అక్కడ జరిగిన సంఘటనలపై సిబిఐ విచారణ జరిపించాలని, ఎన్నికల నిర్వహణకు దుబ్బాకకు కేంద్ర దళాలను పిలిపించాలని కోరారు.
ఎన్నికలలో గెలుపు కోసం అధికార పక్షం పోలీసులు, రెవిన్యూ అధికారులను ఉపయోగించుకొంటున్నట్లు వారు ఆరోపించారు. స్థానిక పోలీస్ కమీషనర్ తన అధికార హోదాను దుర్వినియోగ పరుస్తూ, సీఎం కేసీఆర్, ఆర్ధిక మంత్రి హరీష్ రావు లతో రోజు సంప్రదింపులు జరుపుతూ అధికార యంత్రాంగాన్ని అధికార పక్షం కోసం ఉపయోగిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.
స్థానిక పోలీస్, రెవిన్యూ అధికారులు కేసీఆర్, హరీష్ రావు కనుసన్నలలో అధికారపక్ష అభ్యర్థి గెలుపుకోసం పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు బిజెపి అభ్యర్థి మామగారి ఇంటిపై సోదా పేరుతో దాడి చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దుబ్బాక ఉప ఎన్నిక ఒక చరిత్రను సృష్టించబోతోందని ఇంద్రసేనారెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పతనానికి నాంది పలకబోతోందని స్పష్టం చేశారు. న్నారు. ఎలాగైనా దుబ్బాక ఉప ఎన్నికలో గెలవాలనే దుష్టబుద్దితో సీఎం, మంత్రులు అధికార బలంతో బీజీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని, ప్రచారం చేయనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
రఘునందరావు భార్య పట్ల, 10 నెలల పసిబిడ్డ పట్ల చాల అమానుషంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. మాస్క్ లు లేకుండా, మహిళా పోలీసులు లేకుండా ఇళ్లలో దాడులు ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు.
రఘునందనరావుకు సంబంధం లేని సిద్దిపేటలో దాడులు చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. బిజెపి అభ్యర్థి ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో సిద్దిపేటలో తప్పుడు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కుమార్ పట్ల దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారని, పోలీసులు అతని గొంతు పట్టుకొని, బలవంతంగా కారులో నుండి బైటకు లాగి, కరీంనగర్ కు పంపించి వేశారని తెలిపారు.
బిజెపి కార్యకర్తల పట్ల కూడా పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని చెబుతూ ఇప్పటి వరకు అక్కడ పోలీస్ పరిశీలకుడిని ఎన్నికల కమీషన్ నియమించలేదని చెప్పారు. సిద్ధిపేట పోలీసులు దాఖలు చేసిన కేసులను సిబిఐతో దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా వ్యవహరించిన పోలీస్ కమీషనర్ ను సస్పెండ్ చేసి, ఇతర రెవిన్యూ – పోలీస్ అధికారులను బదిలీ చేయాలనీ లేదా విధులకు దూరంగా ఉంచాలని వారు కోరారు.
More Stories
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?