పాకిస్థాన్, చైనాలతో ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న దశలో భారత దేశానికి మద్దతుగా నిలుస్తామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో భరోసా ఇచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన త్యాగధనులకు నివాళులర్పించారు.
ఈ ఏడాది జూన్‌లో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన 20 మంది భారత సైనికులకు కూడా నివాళులర్పించారు.
2+2 భారత్ – అమెరికా మంత్రుల స్థాయి చర్చల అనంతరం సంయుక్త ప్రకటన జారీ చేసిన సందర్భంగా మైక్ పొంపియో మాట్లాడుతూ, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనిక దళాల సాహస వీరులను గౌరవించేందుకు జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించినట్లు తెలిపారు.
భారత దేశం తన సార్వభౌమాధికారం, స్వేచ్ఛలకు ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత దేశానికి అమెరికా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ విసురుతున్న సవాలును మాత్రమే కాకుండా అన్ని రకాల ముప్పును ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా తమ మధ్య సహకారాన్ని పటిష్టపరచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గత ఏడాది సైబర్ సమస్యలపై సహకారాన్ని పెంపొందించుకున్నట్లు, ఇండియన్ ఓషన్‌లో జాయింట్ ఎక్సర్‌సైజ్‌లను ఇరు దేశాల నావికా దళాలు నిర్వహించినట్లు గుర్తు చేసారు. ప్రజాస్వామ్యం, శాసనబద్ధ పాలన, పారదర్శకతల మిత్రుల జాబితాలో చైనా కమ్యూనిస్టు పార్టీ లేదని అమెరికా నేతలకు, ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు.
ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి మాత్రమే కాకుండా అన్ని రకాలుగా ఎదురయ్యే ముప్పులకు వ్యతిరేకంగా సహకారాన్ని పటిష్టపరచుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా భారత్, అమెరికా దేశాలు ప్రాధమిక మార్పిడి, సహకారం ఒప్పందం (బీఈసీఏ) ఒప్పందం కుదుర్చుకున్నాయి. సైనిక సాంకేతిక అంశంపై రెండు దేశాలు సహకారం అందించుకోనున్నాయి.
రెండు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం అత్యంత ప్రధానమైనదని భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదరడం గొప్ప ముందడుగు అని చెప్పారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో శాంతి, భద్రతలకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటిస్తున్నామని చెప్పారు. భారత్, అమెరికా సైన్యాల మధ్య పరస్పర సహకారం సజావుగా ముందుగా సాగుతోందతూ రక్షణ పరికరాలను ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి తగిన ప్రాజెక్టులను గుర్తించామని చెప్పారు.
అంతర్జాతీయ సముద్రాల్లో స్వేచ్ఛాయుత సముద్రయానం, శాసనబద్ధ నిబంధనలను గౌరవించే నియమబద్ధ అంతర్జాతీయ విధానాన్ని సమర్థించాలని భారత్, అమెరికా అంగీకరించినట్లు తెలిపారు. అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను సమర్థించే అంతర్జాతీయ వ్యవస్థను సమర్థించాలని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అమెరికా రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పర్ కూడా పాల్గొన్నారు.
More Stories
త్వరలో జనగణన… ఆ తర్వాతే కులగణనపై నిర్ణయం!
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర