జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లో ఎవరైనా భూమి కొనొచ్చు  

జమ్మూ కశ్మీర్‌, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలలో భూములను కొనుగోలు చేసే విధానంపై కేంద్రం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జమ్మూ కశ్మీర్ లో ఎవరైనా భూములను కొనుగోలు చేసుకోవచ్చు. అక్కడ నివాసం ఉండవచ్చు అని ప్రకటించింది.

అయితే.వ్యవసాయ భూములు ఇందుకు మినహాయింపు అని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.   ఈ ఉత్తర్వుల ప్రకారం భారతదేశానికి చెందిన ఏ పౌరుడైనా జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేయవచ్చు. 

ఈ ఉత్తర్వును జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ మూడవ ఉత్తర్వు, 2020 అని పిలుస్తారని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. ఈ ఉత్తర్వు తక్షణమే అమల్లోకి వస్తుందని, జనరల్ క్లాజ్ యాక్ట్, 1897 ఆర్డకు వర్తిస్తుందని కేంద్రం స్పష్టంచేసింది. 

ఎలాంటి నివాస యోగ్యతా పత్రాలు చూపించకుండానే భూములను కొనుగోలు చేసుకోవచ్చని హోంశాఖ స్పష్టం చేసింది. ఇదంతా జమ్మూ కశ్మీర్ పునర్య్వవ్యస్థీరణ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపింది. 

అయితే వ్యవసాయ భూములను మాత్రం వ్యవసాయం చేసే వారు మాత్రమే కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతేతరులు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది తమ అభిమతమని, పారిశ్రామిక భూముల్లో పెట్టుబడులు అత్యావశ్యకమని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు.

ఆర్టికల్ 370 ను రద్దు చేయడంతో ఈ చట్టం పూర్వ జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని ‘జమ్ముకశ్మీర్’ , ‘లడఖ్’ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతకుముందు 2020 సెప్టెంబర్‌లో జమ్ముకశ్మీర్ పరిపాలన, 2020 గ్రాంట్ ఆఫ్ డొమిసిల్ సర్టిఫికేట్ (ప్రొసీజర్) నిబంధనలను సవరించింది.