కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌   ‘‘మహా మోసగాళ్లు’’ 

మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌లు ఇద్దరు ‘‘మహా మోసగాళ్లు’’ అనీ బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి  జ్యోతిరాదిత్య సింధియా తీవ్రంగా ధ్వజమెత్తారు. వారిద్దరూ  ‘‘అవినీతి’’ ప్రభుత్వాలను నడిపి ఓట్లు వేసిన ప్రజలను నిలువునా మోసగించారంటూ దుయ్యబట్టారు.

తాను లేవనెత్తిన ప్రజా సమస్యలపై అడుగడుగునా నిర్లక్ష్యం చూపించిన కారణంగానే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని సింధియా స్పష్టం చేశారు. వచ్చే నెల 3న జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  ఎన్నికలు జరుగుతున్న మొత్తం 28 స్థానాల్లో 27 కాంగ్రెస్ పార్టీ స్థానాలే అయినందున బీజేపీ నష్టపోయేదీ ఏమీ లేదని, నష్టమంతా కాంగ్రెస్‌కేనని ఆయన తెలిపారు.

సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోమధ్య ప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోవడంతో పాటు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అనంతరం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇంకో మూడు స్థానాలు సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి కారణంగా ఖాళీ అయ్యాయి.

“ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఆశపెట్టుకున్నా మొత్తం 28 స్థానాల్లోనూ ఒక్కటికూడా తగ్గకుండా గెలవాలి. అందులోనూ ఇటీవలే ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీన్ని బట్టి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మద్దతు లేదని స్పష్టమవుతోంది” అని ఆయన వెల్లడించారు. క్షేత్ర స్థాయిలోనే కాదు.. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ పట్ల కనీసం విశ్వాసం లేదని సింధియా ఎద్దేవా చేశారు.